విద్యుత్‌ సరఫరా లేదని 

మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా!
– ప్రభుత్వం తీరుపై మండిపడ్డ శివసేన
నాగ్‌పూర్‌, జులై6(జ‌నం సాక్షి) : ప్రతిపక్ష పార్టీల ఆందోళనతో అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడటం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం విద్యుత్‌ లేదనే కారణంతో సమావేశాలను వాయిదా వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా విధాన భవన్‌ ప్రాంగణం మొత్తం నీటితో నిండిపోయింది. శుక్రవారం ఉదయం పది గంటలకు అసెంబ్లీ సమావేశాలను స్పీకర్‌ హరిభావ్‌ బగ్దే ప్రారంభించాలని అనుకున్నారు. కానీ విధాన భవన్‌లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో సభను గంట పాటు వాయిదా వేశారు. జనరేటర్లపై ఆధారపడి మొత్తం అసెంబ్లీని నడిపించలేమని రాష్ట్ర మంత్రి ఒకరు అన్నారు. వర్షపు నీరు నిలిచి ఉండటంతో ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు ముందస్తుగా విద్యుత్‌ సరఫరాని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు.
కరెంట్‌ లేక సమావేశాలు ఆగిపోవడంపై శివసేన విమర్శలు చేస్తోంది. నాగ్‌పూర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, ఫలితంగా శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకే ఆటంకం ఏర్పడిందని సేన మండిపడింది. దీనిపై రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి చంద్రశేఖర్‌ బవన్‌కులే స్పందించారు. వర్షాల ప్రభావంతో అసెంబ్లీ సమావేశాలు ఆగిపోవడం ఇదే తొలిసారి అని ఆయన అన్నారు.
డ్రైనేజీ సమస్య వల్లే అసెంబ్లీ ప్రాంగణంలో వర్షపు నీరు నిలిచిపోయిందన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.