వినూత్న పద్దతిలో బోధననివ్వాలి జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్థు

నిజామాబాద్‌, నవంబర్‌ 30 : ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు అందిస్తున్నామని, విద్యార్థులకు వినూత్న పద్దతిలో ఉపాధ్యాయులు బోధన చేయడం వల్ల పిల్లలు భవిష్యత్తులో బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్థు తెలిపారు. శుక్రవారం నాడు నిజామాబాద్‌ మండలం గూపన్‌పల్లి గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్‌ క్యాంపు కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అథితిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పాఠశాలలో జవహర్‌ బాల ఆరోగ్య కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మెడికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఈ సమయంలో ప్రైవేటు పిల్లల డాక్టర్‌ హరికృష్ణ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఖరీదైన మందులతో క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. పాటశాలలో గోడలకు పేయింటింగ్‌, విద్యుత్‌ ఫర్నిచర్‌ తదితర సామాగ్రి  ఒక్కొక్కటి గ్రామ ప్రజలు, దాతల సహకారంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠశాల అభివృద్ధికి కృషిచేయడం బాగుందన్నారు. అలాగే చిన్నప్పటి నుంచే ఆంగ్లం నేర్పిస్తే పిల్లలు బాగా చదువుకుని దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో ఉన్నత ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన హెల్త్‌ క్యాంపును ప్రారంభించి, విద్యార్థులు కలెక్టర్‌ స్టెతస్కోప్‌ పెట్టుకొని పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శ్రీనివాస చారి, డిప్యూటి డిఇఓ సత్యనారాయణరెడ్డి, మండల విద్యాధికారి లింగమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.