విమానం గాల్లో…. మిరాకిల్

jyo4దుబాయ్: అది సెబు పసిఫిక్ ఎయిర్ ఫ్లైట్. ఈ నెల(ఆగస్టు) 14న దుబాయ్ నుంచి మనీలాకు బయల్దేరింది. అందులో ఓ గర్భిణీ స్త్రీ, ఆమె తల్లి వెళ్లారు. అలా విమానం టేకాఫ్ తీసుకొని మధ్యలోకి వెళ్లగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో తోటి ప్రయాణికులు అప్రమత్తమవడంతోపాటు విమానంలోనే సిబ్బందికి ఈ విషయం చేరవేయడంతో మెడికల్ అసిస్టెంట్స్ వచ్చారు. ప్లైట్ మధ్యలో దించే పరిస్థితి లేదు. మరోపక్క పురిటినొప్పులు ఎక్కువై ఆ బాధతో అరుస్తుండగా ఆమెను సీట్లో నుంచి కొంచెం విశాలమైన చోటుకి తీసుకెళ్లి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేస్తుండగానే ఓ పండంటి బిడ్డకు జన్మినిచ్చింది.

అక్కడే ఓ డబ్బు నిండా మినరల్ వాటర్ నింపి ఆ నీటితో పసిబిడ్డను శుభ్రం చేశారు. అనంతరం తల్లికి స్నానం చేయించారు. ఆ తర్వాత ఆమె తన ముద్దులపాపను చేతుల్లోకి తీసుకొని ఏం చక్కా ఎప్పటిలాగే తన సీట్లో కూర్చుంది. అలా నిమిషాల్లోనే విమానంలో ఇద్దరుగా వచ్చినవారు ముగ్గురయ్యారు. ఆ ప్రయాణికురాలు తల్లిగా ఆమెకు తల్లిగా ఉన్న పెద్దావిడ బామ్మగా మారింది. ఇదంతా పక్క సీట్లో కూర్చుని గమనించిన ఓ ప్రయాణికురాలు తన ఫేస్ బుక్ లో ఆ మాతృమూర్తి ఫొటోతో సహా పోస్ట్ చేసింది. ఇది నిజంగా ఓ మిరాకిల్ అంటూ రాసుకొచ్చింది.

అంతేకాదు.. ఈ పాప జన్మించే సమయంలో విమానం భారత దేశ గగనతలంలో ఉంది. అప్పుడే జన్మించిన బిడ్డ రక్షణ చర్యలకోసం విమానాన్ని అత్యవసరంగా ఢిల్లీలో కూడా దించారు. అలా 8గంటల్లో ముగియాల్సిన ప్రయాణం 18గంటలకు పట్టింది. అయినప్పటికీ ఏ ఒక్క ప్యాసింజర్ కూడా ప్రశ్నించలేదంట. మరో ఆశ్చర్యం ఏంటంటే భారత భూభాగంలో జన్మించిన ఈ బిడ్డకు టెక్నికల్ గా భారత పౌరసత్వం వస్తుందట. అయితే, విమానంలోగానీ, నౌకలోగాని జన్మించిన బిడ్డకు అవి ఏ దేశానికి చెందినవి అవుతాయో ఆ దేశాల పౌరసత్వాలే వస్తాయని యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషన్ల సివిల్ ఏవియేషన్ సంస్థ తెలిపింది.