విరాట్‌ వీర విహారం

 
– 58 బంతుల్లో 99 పరుగులు – సెంచరీ చేజార్చుకున్న కొహ్లి

– చివరి వరకూ పోరాడి ఓడిన ఢిల్లీ

– ప్లే ఆఫ్‌ను మెరుగు పరుచుకున్న బెంగళూరు

ఢిల్లీ :

ఢిల్లీలో శుక్రవారం రాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 183 పరుగులు చేసింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా 17 బంతులు ఆడి 17 పరుగులకే వికెట్‌ కోల్పోయాడు. క్రిస్‌గేల్‌  అభిమానులను నిరాశ పరిచారు. 7 బంతులు ఆడి 4 పరుగులకే పటాన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కొహ్లి చెలరేగి ఆడాడు. 58 బంతుల్లో 99 (10 ఫోర్లు, 4 సిక్స్‌లు) పరుగుల చేశాడు. సెంచరీకి ఒక్క పరుగు చేయాల్సి ఉండగా రనౌట్‌ అయ్యాడు. హెన్రీ 26, డివిల్లర్స్‌ 32 (నాటౌట్‌) పరుగులు చేశారు. 184 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ జయవర్ధనే 13 బంతులు ఆడి 19 పరుగుల వద్ద వికెట్‌ చేజార్చుకున్నాడు. వీరెంద్ర సెహ్వాగ్‌ 10 బంతులు ఆడి 18 పరుగులు చేసి ఉనద్‌క్త్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఔటయ్యాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చంద్‌ 35 బంతులు ఆడి 41 పరుగులు చేశాడు. ఉనద్క్‌క్త్‌ విసిరిన బంతికి షాట్‌ కొట్టబోయి వినయ్‌కుమార్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. వార్నర్‌ ఆరు బంతులు ఆడి 4 పరుగులకే వెనుదిరిగాల్సి వచ్చింది. రోహ్రర్‌ 32, జాదవ్‌ 8, మార్కెల్‌ 19 పరుగులు చేశారు. చివరి ఓవర్లలో  19 పరుగులు చేయాల్సి ఉండగా ఢిల్లీ జట్టు 15 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో ఇర్ఫాన్‌ పఠాన్‌ 11 బంతుల్లో 23 పరుగులు చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. బెంగళూరు బౌలర్లలో ఉనద్క్‌క్త్‌ 4 వికెట్లు తీయగా, హెన్రిక్‌, వినయ్‌కుమార్‌ తలో వికెట్‌ తీశారు. ఈ విజయంతో బెంగళూరు ప్లే ఆఫ్‌ అవకా శాలను మెరుగు పరుచుకుంది.