వివి బెయిల్ కొనసాగింపు: గంటన్నర వాదనలు, ఒక అడుగు ముందుకు…
దాదాపు ఏడాదిన్నరగా వివి బెయిల్ విషయమై కొనసాగుతున్న అనిశ్చితి చివరికి ఎట్టకేలకు ముగింపుకు వచ్చింది. ఈ ఏడాదిన్నరగా వారానికొకసారి, రెండు వారాలకొకసారి, కోర్టు వాయిదా ఉన్నప్పుడల్లా ఏం జరుగుతుందో, ఈ ఉపశమనం ఎన్నాళ్లుంటుందో, తర్వాత ఏమవుతుందో అనే అనిశ్చితి, ఆందోళన ఇవాళ సుప్రీం కోర్టు తీర్పుతో తొలగిపోయాయి. ఆరోగ్యకారణాల మీద బెయిల్ ఇస్తున్నామని, గతంలో బొంబాయి హైకోర్టు విధించిన కాల పరిమితిని తొలగిస్తున్నామని జస్టిస్ యు యు లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధులియాల బెంచి తీర్పు ఇచ్చింది. కాకపోతే, కేసు విచారణ జరుపుతున్న కోర్టు పరిధి, ముంబాయి నగర పరిధి, దాటిపోగూడదనే పాత షరతును కొనసాగించింది.
ఇవాళ బెంచి ముందున్న జాబితాలో మూడో అంశంగా ఉన్న ఈ కేసులో వాదనలు 10.40కి మొదలయ్యాయి. 12.00 కు న్యాయమూర్తులు తీర్పు డిక్టేట్ చేయడం ప్రారంభించి, 12.15 కు ముగించారు. ఈ క్రమంలో వాదనలు ఆసక్తికరంగా సాగాయి.
విచారణ ప్రారంభం కాగానే జస్టిస్ లలిత్ పిటిషనర్ వయసు ఎంత అని, ఎంతకాలంగా జైలులో ఉన్నారని, విచారణ ఏ దశలో ఉన్నదని, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి ఏమిటని వివి తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ ను అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఎన్ఐఎ తరఫున వాదన వినిపించడానికి అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఎస్ వి రాజు లేచి నిలబడగానే, ఈ కేసులో పిటిషనర్ కు విధించగల శిక్ష ఏమిటని జస్టిస్ లలిత్ అడిగారు. “మరణశిక్ష” అని రాజు జవాబిచ్చాడు. “కేసు విచారణ ఎన్నాళ్లలో పూర్తవుతుంది” అని న్యాయమూర్తి వేసిన ప్రశ్నకు “నిందితులు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ విచారణకు అడ్డంకులు సృష్టిస్తున్నార”ని రాజు జవాబిచ్చాడు. “విచారణ ఏ దశలో ఉంది?” “మీరు దీనికి తార్కిక ముగింపు ఎప్పుడు పలకదలచుకున్నారు?” “ఎంతమంది సాక్షులను విచారించాలి?” “నిందితులందరినీ ఇంకా ఎందుకు అరెస్టు చేయలేదు?” “ఇంకా చార్జెస్ కూడ ఎందుకు ఫ్రేమ్ చేయలేదు?” వంటి ప్రశ్నలను న్యాయమూర్తి తర్వాత గంట సేపట్లో ఎన్నోసార్లు రెట్టించి అడిగారు. విచారణలో జరుగుతున్న ఆలస్యానికంతా నిందితులే కారణమని, నిందితులు ఏ అడ్డంకులూ కల్పించకపోతే ఏడాదిన్నరలో కేసు ముగిస్తామని రాజు అన్నాడు.
తమ మీద ఆరోపణల సాక్ష్యాధారాల ప్రతులను నిందితులకు ఇవ్వడం అనే కేసు విచారించడానికి మొదటి మెట్టు అయిన పనిని ప్రాసిక్యూషన్ ఇంతవరకూ చేయలేదని, పదహారు మంది నిందితులలో (ఒకరు చనిపోగా), ఇద్దరికి మాత్రమే ఆ ప్రతులు ఇచ్చారని, వందలాది మంది సాక్షుల విచారణ జరగాలని, ప్రతిరోజూ విచారణ జరిగినా, కేసు పూర్తి కావడానికి పది సంవత్సరాలు పడుతుందని ఆనంద్ గ్రోవర్ అన్నారు.
ఇక ఎస్ వి రాజు తన వాదనలు కొనసాగిస్తూ, ఆరోగ్యకారణాల మీద బెయిల్ కొనసాగించమని అడగడానికి ఆధారమే లేదని, పిటిషనర్ ఆరోగ్యం చాల బాగున్నదని, మెరుగు పడిందని, ఆయనకు కేవలం కొవిడ్ సమస్య తప్ప మరే సమస్యా లేదని ఆయనే ఎంచుకున్న హోలీ మేరీ ఆస్పత్రి డిశ్చార్జి సమ్మరీలో ఉందని అన్నాడు. అందువల్ల ఆరోగ్యకారణాల మీద బెయిల్ ఇవ్వనక్కరలేదని అన్నాడు.
అప్పుడు న్యాయమూర్తి కల్పించుకుని, “పిటిషనర్ కు బెయిల్ వచ్చిన మొదటి ఆరు నెలల్లో గాని, తర్వాత గడిచిన పదకొండు పన్నెండు నెలల్లో గాని బొంబాయి హైకోర్టు విధించిన షరతులను పిటిషనర్ ఉల్లంఘించినట్టు మీరేమైనా ఆరోపిస్తున్నారా” అని అడిగారు. ఆ మాట చెప్పలేనని ఎన్ఐఎ న్యాయవాది నీళ్లు నమిలాడు. ‘పిటిషనర్ ను ఎన్ఐఎ విచారించిందా’ అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు ‘విచారించలేదు’ అని జవాబు చెప్పాడు. ‘మరి మీరు అవకాశం వచ్చినా విచారణ జరపక, ఆయన కూడ హైకోర్టు షరతులు ఉల్లంఘించకుండా ఉన్నప్పుడు, 82 సంవత్సరాల వృద్ధుడికి బెయిల్ కొనసాగించడానికి మీకేమి అభ్యంతరం’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు.
ఈ కేసులో, ఈ పిటిషనర్ విషయంలో వయసుకు సంబంధమే లేదు. ఆయన “చాల భయంకరమైన, తీవ్రమైన దేశవ్యతిరేక నేరస్తుడు” అంటూ ఎవరో ఎవరికో రాసిన ఉత్తరాలు (భీమా కోరేగాం కేసు నిందితుల కంప్యూటర్లలోకి జొరబడి, ప్రవేశపెట్టిన ఉత్తరాలు) చదివి వినిపిస్తూ, మణిపూర్ తీవ్రవాదులతో, ఆయుధాల కొనుగోళ్లతో, కొనుగోళ్లకు నిధులు సమకూర్చడంతో పిటిషనర్ కు సంబంధం ఉన్నదని జాబితా చదవడం మొదలు పెట్టాడు. ఆ ఉత్తరాల్లో ఒక హిందీ ఉత్తరం చదువుతుండగా, ‘అది రాసినవారెవరు’ అని న్యాయమూర్తి అడిగారు. ‘సురేంద్ర గాడ్లింగ్, మరొక నిందితుడు’ అని రాజు జవాబివ్వగా, ‘ఆయన ఏ ప్రాంతం వాడు’ అని అడిగారు. ‘మహారాష్ట్ర’ అని జవాబిస్తే, “అబ్బ ఆయన అంత శుద్ధమైన హిందీ రాశాడా” అని న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు.
ఆ ఉత్తరాలు, ఆరోపణలు విన్నాక, ‘వీటిని మీరు ఎలా రుజువు చేస్తారు’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయినా ఇప్పుడు ఆరోగ్య కారణాల బెయిల్ విచారిస్తున్నామని, గతంలో ఇచ్చిన బెయిల్ ను పిటిషనర్ దుర్వినియోగం చేశాడని ఏమైనా చెప్పగలరా అని మళ్లీ అడిగారు. “బెయిల్ మీద బైట ఉన్న ఆయనను మీరు వెంటాడుతూనే ఉండి ఉంటారు గదా, గట్టి నిఘా పెట్టి ఉంటారు గదా. ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించాడని, బెయిల్ ను దుర్వినియోగం చేస్తూ అటువంటి పనులే చేశాడని చెప్పగలరా” అని అడిగారు. “మా దగ్గర ఆ సమాచారం లేదు. కాని ఆయన మౌనంగా కూచునే మనిషి కాదు. ఇమెయిల్ ద్వారా ఆ పని చేస్తుండవచ్చు” అని రాజు అన్నాడు.
అప్పుడిక యుఎపిఎ అస్త్రం బైటికి తీసి ఆ చట్టం కింద నిందితులైనవాళ్లకు మామూలు చట్టాలేవీ వర్తించవని, 43(డి)(5) ప్రకారం బెయిల్ ఇవ్వాలంటే ప్రాసిక్యూటర్ అభిప్రాయం తీసుకోవాలని, ప్రాసిక్యూషన్ చూపుతున్న ఆధారాల ప్రకారం నేరం జరిగిందని ప్రాథమిక విశ్వాసం ఉంటే బెయిల్ ఇవ్వగూడదని చదివి వినిపించాడు. దానిమీద న్యాయమూర్తి, “అయితే మీరు యుఎపిఎ నేరస్తులకు బెయిల్ అనే మాటే ఉండదు అని చెపుతున్నారా” అని ఒకటికి రెండు సార్లు అడిగారు. “అవును ఉండదు” అని రాజు అన్నాడు. “మరి అట్లాగైతే బొంబాయి హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను మీరు చాలెంజ్ చేసి ఉండవలసింది గదా, ఎందుకు చేయలేదు” అని న్యాయమూర్తి అడిగారు.
మామూలుగా తమలో తాము సంప్రదించుకోవలసి వచ్చినప్పుడు ముగ్గురు న్యాయమూర్తులూ తమ ముందున్న మైకులు ఆఫ్ చేసి తమలో తాము మాట్లాడుకున్నారు. ఈ గంటన్నరలో అలా నాలుగుసార్లు, దాదాపు పది పన్నెండు నిమిషాలు తమలో తాము సంప్రదించుకున్నారు. రాజు ఈ మాట అనగానే కూడ మైకులు ఆఫ్ చేశామనుకుని న్యాయమూర్తులు మాట్లాడుకున్నారు. కాని ఒక మైక్ ఆఫ్ కానట్టుంది. “అలా బెయిల్ ఉండదు అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం కదా, అధికరణం 21 జీవించే హక్కుకు వ్యతిరేకం కదా” అని వాళ్లలో వాళ్లు మాట్లాడుకోవడం బైటికి వినబడింది.
“మీ చార్జిషీట్ ప్రకారమే పిటిషనర్ కు ఎన్ని మరణాలతో సంబంధం ఉంది” అని న్యాయమూర్తి మళ్లీ ఒక ప్రశ్న వేశారు. “అసలు చార్జిషీట్ లో మరణాలు, ఘటనలు, చర్యలు లేనేలేవు. ఉన్నదల్లా ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలని చెపుతున్న ఉత్తరాలు, పత్రాలు మాత్రమే” అని ఆనంద్ గ్రోవర్ అన్నారు. దానితో న్యాయమూర్తి రాజును మరొకసారి ఆ ప్రశ్నే అడిగారు. రాజు ఏవో ఆంబుష్ ల గురించి ఉత్తరాల్లో ఇట్లా ఉన్నది అని చదివి వినిపించబోయాడు. “అదంతా సరే, వాటిని ఎట్లా నిరూపిస్తారు? ఈ పిటిషనర్ కు ఏ ప్రాణనష్టంతోనైనా ప్రత్యక్ష సంబంధం ఉన్నదని మీ చార్జిషీట్ ఆరోపిస్తున్నదా? ఎన్ని మరణాలు జరిగాయి” అని మళ్లీ అడిగారు.
“ఒక్కరు మరణించారు. భీమా కోరేగాం హింసాకాండలో” అని రాజు జవాబిచ్చాడు.
న్యాయమూర్తి వ్యాఖ్యల సరళి చూసి, రాజు, “నేనొక సూచన చేస్తాను. మీరు బెయిల్ ఇవ్వదలచుకుంటే ఆరు నెలల సమయం పెట్టి, పిటిషనర్ కు అన్ని వైద్య పరీక్షలు చేయించి చూడండి” అని బేరం పెట్టాడు.
తర్వాత ఆనంద్ గ్రోవర్ లేచి గత మెడికల్ రిపోర్టులలో ఉన్న తీవ్రమైన అనారోగ్య అంశాలను ఎత్తి చూపారు. ప్రాసిక్యూషన్ ఆధారపడుతున్న ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాలన్నీ నిందితుల కంప్యూటర్లలో జొరబడి ప్రవేశపెట్టినవని నాలుగు అంతర్జాతీయ సంస్థలు విశ్లేషించాయని చెప్పారు.
“అడిషనల్ సాలిసిటర్ జనరల్ వాదనలలోకి ఇప్పుడు వెళ్లబోవడం లేదు. నాలుగు విషయాలు మాత్రం చెపుతాను. ఒకటి, నా వయసు 82 సంవత్సరాలు. ఇప్పటికే అనేకసార్లు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరవలసి వచ్చింది. బెయిల్ మీద ఉన్న ఈ పదిహేడు నెలల్లో కూడ మూడు సార్లు ఆస్పత్రిలో చేరాను. నా వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా బెయిల్ ఇవ్వమని కోరుతున్నాను. రెండు, నామీద 24 కేసులున్నాయని ప్రాసిక్యూషన్ చెపుతున్నది. ఆ 24 కేసులూ విచారణ జరిగి నేను నిర్దోషినని రుజువయింది. న్యాయస్థానాలు కేసులు కొట్టేశాయి, డిశ్చార్జి చేశాయి, ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకుంది. మూడు, ఈ కేసులో కూడ నేను నిర్దోషిగా విడుదలవుతాను, విచారణకు సిద్ధంగా ఉన్నాను. కాని విచారణ జరగడానికి ఇంకో పదేళ్లు పడుతుంది గనుక ఆ పదేళ్లూ, నా జీవితాంతమూ బెయిల్ లేకుండా జైలులో ఉండాలనడం అన్యాయం. నాలుగు, న్యాయవ్యవస్థ కోసం, ప్రభుత్వం కోసం, ప్రాసిక్యూషన్ కోసం కూడ నేను విచారణకు సిద్ధంగా, ఆరోగ్యంగా, సజీవంగా ఉండాలి. జైలుకు పంపితే నేను చనిపోతాను. అప్పుడు విచారించడానికి మీకు నిందితుడూ ఉండడు. నిర్దోషిగా నన్ను నేను రుజువు చేసుకోవడానికి నేనూ ఉండను” అన్నారు.
జస్టిస్ లలిత్, “మేం ఎవరూ చనిపోవాలని కోరుకోం. అందరూ బతికి బాగుండాలనే కోరుకుంటాం” అన్నారు.
ఇక తీర్పు డిక్టేట్ చేస్తూ, మొట్టమొదట స్పెషల్ లీవ్ పిటిషన్ కోరిన లీవ్ ను ఆమోదిస్తున్నాము అన్నారు. “పిటిషనర్ మీద కేసు విచారణ ఇంకా ప్రారంభం కాలేదు, చార్జెస్ ఫ్రేమ్ చేయడమే జరగలేదు. కాలం గడుస్తున్నకొద్దీ పిటిషనర్ ఆరోగ్యం మెరుగుపడుతున్న సూచనలేమీ లేవు. అందువల్ల బెయిల్ ను ఉపసంరించడం సాధ్యం కాదు. ఆరోగ్యకారణాల మీద వరవరరావుకు బెయిల్ పొందడానికి అర్హత ఉన్నదని భావిస్తున్నాం. గత హైకోర్టు తీర్పులో విధించిన కాలపరిమితిని కూడ తొలగిస్తున్నాం” అన్నారు.
తర్వాత, పిటిషనర్ కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్న నేరాలు చాల తీవ్రమైనవనడంలో సందేహం లేదు. కాని ఆయన వయసు, ఆరోగ్యం, బెయిల్ కాలంలో బెయిల్ షరతులను ఉల్లంఘించకుండా ఉన్న ప్రవర్తన దృష్ట్యా బెయిల్ కొనసాగించాలని భావిస్తున్నామన్నారు. ఈ బెయిల్ కాలంలో పిటిషనర్ విచారణ జరుపుతున్న న్యాయస్థానపు పరిధి దాటి, అనుమతి లేకుండా వెళ్లగూడదు. ఈ బెయిల్ వల్ల వస్తున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేయగూడదు. సహనిందితులను కలవగూడదు, సాక్షులను కలిసి ప్రభావితం చేయగూడదు. తనకు అవసరమైన వైద్య పరీక్షలు వీలైన చోట చేయించుకొని, ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలి అని తీర్పు చెప్పారు.
“విచారణ జరుపుతున్న న్యాయస్థానపు పరిధి అంటే మహారాష్ట్ర రాష్ట్రమంతా వస్తుంది, అందువల్ల దాన్ని ముంబాయి అని మార్చండి” అని రాజు కోరగా, అందుకు అంగీకరించి ఆ మార్పు చేశారు. “ఈ తీర్పును ఇతర నిందితులు వాడుకొని, తలనొప్పి ఉంది గనుక బెయిల్ ఇవ్వండి అని వస్తారు, ఇది అందరికీ వర్తించదు అని రాయండి” అని రాజు కోరగా అప్పటికే ఇది ఇతర కేసులకు ఉదాహరణ కాజాలదు అని చెప్పాము అని న్యాయమూర్తి అన్నారు.
అసలు ముంబాయిలో ఉండడం ఆర్థికంగా భారంగా ఉన్నదని, కుటుంబ సభ్యులు తెలంగాణలో ఉన్నారని, పెన్షనర్ గా తెలంగాణలో ఉచిత వైద్య, ఆరోగ్య సేవలు అందుతాయని, అందువల్ల ముంబాయి షరతు ఎత్తివేసి హైదరాబాదు వెళ్లడానికి అనుమతించమని పెట్టుకున్న పిటిషన్ ను కూడ పరిగణనలోకి తీసుకోవాలని ఆనంద్ గ్రోవర్ కోరారు. “ఆ పిటిషన్ ఇంకా లిస్ట్ కాలేదు. లిస్ట్ అయి, మా ముందుకు వచ్చినప్పుడు దాన్ని విచారిస్తాం” అని జస్టిస్ లలిత్ అన్నారు