వీఆర్ఏల పే స్కేల్ సాధన జాతర

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 29వ రోజుకు చేరింది.ఈ సమ్మెలో భాగంగా పట్టణంలో వీఆర్ఏలు పేస్కేల్ సాధన జాతర పేరిట వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.డోలు వాయిద్య చప్పుల్లతో, పులి వేషధారణలతో బోనాలు, బతుకమ్మలను ఎత్తుకుని కొత్త బస్టాండ్ మీదుగా శంకర్ విలాస్ సెంటర్, వాణిజ్య భవన్ , పూల సెంటర్, కల్నాల్ సంతోష్ బాబు సెంటర్ నుండి బతుకమ్మ చౌరస్తా మినీ ట్యాంక్ బండు వరకు సుమారు 500 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం బతుకమ్మ ఆటలాడుతూ, వివిధ రకాల నృత్యాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు మహమ్మద్ రఫీ , మీసాల సునీల్ గవాస్కర్,లచ్చిమల్ల నర్సింహరావు , పాల్వాయి వెంకన్న , శ్రీను మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్ జీవో జారీ చేయాలని, ప్రమోషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు.55 ఏళ్లు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జెఏసి నాయకులు గొబ్బి నర్సయ్య , గొరుగంటి మధుసూదన్ రావు , అంజపల్లి నాగమల్లేష్ , మామిడి సైదులు , కాసాని వెంకన్న , జహంగీర్ , వీరేష్ , లక్ష్మారెడ్డి, ఆదిత్య ,ఉపేందర్ , సతీష్, నాగు, అనిత, మాధవి, లక్ష్మి బాయి, సంధ్య, పిచ్చమ్మ ,23 మండలాల అధ్యక్షులు,కో కన్వనర్లు, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.