వీడియోను మార్ఫింగ్‌ చేశారు

– మెకాన్‌ సంస్థ స్టీల్‌ప్లాంట్‌కు ముందుకొస్తే ..
మాకేం అభ్యంతరం లేదని కేంద్రం చెప్పింది
– ఎంపీ మురళీమోహన్‌
న్యూఢిల్లీ, జూన్‌29(జనం సాక్షి) : కేంద్ర ఉక్కు కర్మాగార శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌తో గురువారం సమావేశం అయిన అనంతరం తెలుగుదేశం పార్టీ ఎంపీలు కలిసి మాట్లాడుకుంటున్న వీడియోను కొందరు తమకు అనుకూలంగా మార్ఫింగ్‌ చేశారని ఎంపీ మురళీమోహన్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఆ వీడియోనే టీవీల్లో, సోషల్‌ విూడియాలోనూ వైరల్‌ అయ్యిందన్నారు. అదంతా విూడియా సృష్టేనని, రాష్ట్ర సమస్యలపై విూడియాకు బాధ్యత ఉందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబుతో మెకాన్‌ సంస్థకు లేఖ రాయించాలని కేంద్రం సూచించిందని, మెకాన్‌ సంస్థ సంతృప్తి చెంది.. స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొస్తే.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం చెప్పిందని మురళీమోహన్‌ పేర్కొన్నారు.
ఆ రెండు పార్టీలు బీజేపీకి పేయిడ్‌ కన్సల్టెంట్స్‌ – గల్లా జయదేవ్‌
వైసీపీ, జనసేన పార్టీలు బీజేపీకి పేయిడ్‌ కన్సల్టెంట్స్‌అని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ ఆమరణదీక్ష చేస్తుంటే.. జగన్‌, పవన్‌కళ్యాణ్‌ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కుట్ర రాజకీయాలు చేయడానికే వారికి సమయం సరిపోతుందని, ప్రజా సమస్యలు పట్టించుకోడానికి వారికి సమయం ఎక్కడ ఉందని జయదేవ్‌ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా డైరెక్షన్‌లో జగన్‌, పవన్‌ నటిస్తున్నారని జయదేవ్‌ ఆరోపించారు. ఎంపీ మాగంటిబాబు మాట్లాడుతూ జగన్‌ తన పాదయాత్రలో రాష్ట్రం గురించి ఏనాడు మాట్లాడలేదని, సీఎం చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. జగన్‌కు సీఎం కుర్చీపై ఆరాటం తప్ప ఇంక దేనిపై లేదని ఆయన అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పోరాడుతున్నారని, రాష్టాన్రికి కంపెనీలు రాకుండా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మాగంటిబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.