వెంకటాపూర్ తండాలో మెరిసిన గిరిజన ఆణిముత్యం
తల్లి కెతావత్ దేవిబాయి దినసరి కూలీ
* తండ్రి కెతావత్ బాలు నాయక్ ఆటో డ్రైవర్
* తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చిన చదువుల తల్లి
* ఇంటర్ లో అత్యధిక 961 మార్కులు సాధించిన కెతావత్ అంజలి
వికారాబాద్ రూరల్ జూన్ 29 జనంసాక్షి : నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించుటకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది ఓ చదువుల తల్లి. లక్ష్యసాధనలో అహర్నిశలు కష్టపడి తన గమ్యాన్ని చేరింది. అనునిత్యం తన తల్లిదండ్రులు పడుతున్న కష్టాల కడలిని చూస్తూ పెరిగింది ఈ విద్యా కుసుమం. సమాజములో మంచి గుర్తింపు పొందుటకు ఆర్థిక పరిస్థితులు అడ్డుకావని పట్టుదలతో ఇష్టంతో చదివింది. ఇంటర్మీడియట్ లో అత్యధికంగా 961 మార్కులు సాధించింది. జాతీయ దినపత్రిక అయిన ప్రజా పాలన పాఠకులకు అందిస్తున్న వివరాలు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డుకు చెందిన వెంకటాపూర్ తండాలో కేతావత్ దేవిబాయి కేతావత్ విజయ్ కుమార్ ( బాలు నాయక్ ) ,కు ఇదదరు సంతానం. కూతురు కేతావత్ అంజలి కుమారుడు కేతావత్ చిన్న. తమ పిల్లల బతుకులు మాలా మారకూడదని తల్లిదండ్రులు రాత్రింబవళ్లు కష్టపడి చదివిస్తున్నారు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని వమ్ము చేయకుండా కేతావత్ అంజలి చదువులో మేటిగా రాణిస్తున్నది. జిల్లా కేంద్రంలోని సెంట్ ఆంథోని ఉన్నత పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి 10/10 జిపిఎ సాధించింది. చదువులో రాణిస్తున్న తన కూతురును ఉన్నత చదువులు చదివించాలని లక్ష్యం పెట్టుకున్నాడు తండ్రి కేతావత్ బాలు నాయక్. తండ్రి దురలవాట్లకు దూరంగా ఉంటూ ఆటో నడుపుతూ పైసా పైసా కూడబెట్టి తన కూతురి చదువుకు వినియోగించాడు. చదువులో రాణిస్తున్న తన కూతురిని హైదరాబాదులోని బాచుపల్లి నారాయణ జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్ లో చేర్పించాడు. తల్లిదండ్రుల కష్టాలను చూసి అనుభవించిన బాధను చదువులో రాణించాలని నిర్ణయించుకుంది కేతావత్ అంజలి. పట్టుదలతో క్రమశిక్షణతో ఇష్టంతో చదివి ఇంటర్ ఫస్టియర్ లో 470 కి 440 మార్కులు సాధించింది. ఇంటర్ సెకండియర్ లో 470 కి 461 మార్కులు సాధించింది. ప్రాక్టికల్స్ లో 60కి 60 మార్కులు సాధించి ఔరా అనిపించింది. ఇంటర్మీడియట్లో 1000 మార్కులకు గాను 961 మార్కులు సాధించి వెంకటాపూర్ తండా భవిష్యత్ విద్యార్థులకు మార్గదర్శిగా నిలిచింది. కష్టజీవుల తల్లిదండ్రుల శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇచ్చింది. తమ కూతురు చదువుకు పెదనాన్న బాబ్యా నాయక్, నా స్నేహితుల ప్రోత్సాహం మరువలేనిదని గుర్తు చేశారు. కష్టపడి ఇష్టపడి చదివితే సాధించలేనిది ఏదీ ఉండదని నిరూపించింది కేతావత్ అంజలి.
Attachments area
|