వెంకయ్యా… ఆపరేషన్ పోలోపై ఎందుకు మాట్లాడవు?
– భారత సైన్యం హింస కనబడలేదా?
– ఆంధ్రోళ్ల కుట్రలు ఇంకానా!
– కవిత ఫైర్
నిజామాబాద్,సెప్టెంబర్ 7(జనంసాక్షి):నిజాం హయాం నాటి ఆపరేషన్ పోలోను రాజకీయ స్వార్థం కోసమే వాడుకుంటున్నారని ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రి వెంకయ్యపై విమర్శలు గుప్పించారు.తెలంగాణ వచ్చినా ఆంధ్రా కుట్రలు ఇంకా ఆగడం లేదు. ఆంధ్రా కుట్రలను ఉద్యోగులు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో బుధవారం టీఎన్జీవో జిల్లాస్థాయి స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఎంపీ కవితతో పాటు దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను కుట్రలతో ఆపాలని చూస్తున్నారని అన్నారు. అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుఉతన్న దశలో అడుగడుగునా ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. టీఎన్జీవో భవనానికి ఎంపీ నిధుల నుంచి రూ. 25 లక్షలు కేటాయిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులను సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నరన్నారు. త్వరలోనే హెల్త్‌కార్డులు అన్ని అస్పత్రుల్లో పనిచేస్తయని తెలిపారు. బీజేపీ తిరంగాయాత్ర సందర్భంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. తెలంగాణకు అనుకూలంగా 1990లో కాకినాడలో చేసిన తీర్మానాన్ని వెంకయ్యనాయుడు మర్చిపోయారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఏ ఒక్క బీజేపీ నేత పట్టించుకోలేదని తెలిపారు. ఇదిలావుంటే తెలంగాణ భాషా విధానంపై చర్చించేందుకు తెలుగు భాషా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని జెడ్పీ సమావేశ మందిరంలో చర్చాగోష్టి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి సాంబయ్య, పలువురు భాషాభిమానులు, సాహితీవేత్తలు, విద్యావేత్తలు పాల్గొన్నారు. కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.