వెలవెలబోతున్న ప్రాజెక్టులు, ఆందోళనలో రైతులు
ఆదిలాబాద్, జూలై 19 : ఖరీఫ్ ప్రారంభమై నెలన్నర రోజులు గడుస్తున్నా జిల్లాలో అవసరమైన వర్షాలు కురవక నదులు, వాగులు, ప్రాజెక్టులలో నీరు లేక బోసిపోతున్నాయి. ప్రతి ఏడాది జూలై మొదటి వారంలో వర్షాలు కురిసి నీటితో జిల్లాలోని అన్ని జలాశయాలు కళకళలాడుతుండేవి. అలాంటివి జూలై మాసం ముగియడానికి వస్తున్నా ఆశించిన మేరకు వర్షాలు కురవకపోవడంతో రైతులతోపాటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల సాధారణ వర్షపాతం 200 మిల్లిమీటర్లు కాగా కేవలం 102 మిల్లిమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదు అయింది. జిల్లాలో రెండు, మూడు సార్లు వర్షాలు కురిస్తే చాలు అన్ని ప్రాజెక్టులలో నీరు చేరేవి. అలాంటిది ఇప్పటివరకు జలాశయాలు నిండకపోవడంతో ఆ ప్రాంత ఆయకట్టు రైతులు పంటలు వేయలేక దిగాలుగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా ప్రాజెక్టుల కింద సుమారు 50 వేల హెక్టార్లలో పంటలు సాగు అవుతాయి. అలాంటిది నాట్లు వేసేందుకు ప్రజలు ఆలోచనలో పడ్డారు. ఈ ప్రాజెక్టుల కింద ప్రధానంగా వరి పంటను సాగు చేస్తారు. జూలై ఆఖరిలోగా వరినాట్లు పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటివరకు ఎవరూ కూడా నాట్లు వేయలేదు. జిల్లాలోని కడేం, స్వర్ణ వట్టివాగు, తాత్‌నాల, సదర్మట్, గడ్డేన్నవాగు, మచ్చడివాగు తదితర ప్రాజెక్టులలో ఈ 10 రోజుల్లోగా భారీ వర్షాలు కురిస్తే తప్ప ప్రాజెక్టులు నిండే అవకాశాలు లేవు.