వెలుగులోకొచ్చిన సర్టికల్‌ స్టైక్స్ర్‌ వీడియోలు

– ఇవి ఫేక్‌ కాదు, నిజమేనన్న ఆర్మీ అధికారి
న్యూఢిల్లీ, జూన్‌28(జ‌నం సాక్షి) : రెండేళ్ల క్రితం భారత సైన్యం జమ్ముకశ్మీర్‌ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి పలువురు ఉగ్రవాదులను మన సైన్యం మట్టుబెట్టింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు సైన్యం సర్జికల్‌ స్టైక్స్‌ చేసిన వీడియోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి పలు టీవీ ఛానళ్లు ఆ వీడియోలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఆ వీడియోలు అధికారిక వర్గాల నుంచే అందినట్లు తెలుస్తోంది. వీడియో ఫుటేజీలో డ్రోన్లు, మానవరహిత ఏరియల్‌ వెహికిల్స్‌(యూఏవీ)తో సైన్యం మెరుపు దాడులు చేసినట్లు కనిపిస్తోంది. బంకర్లు, పలు మిలటరీ కట్టడాలు ధ్వంసమైతున్నట్లు, పలువురు మరణిస్తున్నట్లు వీడియోల్లో ఉంది.
అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌లు ఢిల్లీ నుంచి వీడియోలు చూస్తూ మెరుపుదాడుల ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. అయితే ఆ వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. భారత సైన్యం చేసిన మెరుపు దాడులను పాకిస్థాన్‌ అప్పట్లో ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోలు నిజమేనని నార్తెర్న్‌ ఆర్మీ మాజీ కమాండర్‌ రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డీఎస్‌ హూడా వెల్లడించారని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనంలో పేర్కొంది. సర్జికల్‌ స్టైక్స్‌ ఆపరేషన్‌కు ఆయన ఇన్‌ఛార్జిగా పనిచేశారు. ‘ఆ వీడియోలు నిజమే. నేను ధ్రువీకరించగలను. సర్జికల్‌ స్టైక్స్‌ జరిగినప్పుడు తీసిన ఆ వీడియోలను అవసరమైనప్పుడు విడుదల చేయాలని అనుకున్నాను. అవి ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది మంచిదే’ అని హూడా అన్నారు. గతంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మెరుపు దాడులు జరిగినట్లు సాక్ష్యం ఏదని, వీడియోలు చూపించాలని ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.