వేగంగా పాస్‌పోర్టు..

– కొత్తయాప్‌ ప్రారభించిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌
న్యూఢిల్లీ, జూన్‌26(జ‌నం సాక్షి) : పాస్‌పోర్టు దరఖాస్తును సులభతరం చేసి, సత్వరమే జారీ చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించింది. ‘పాస్‌పోర్టు సేవా దివస్‌’ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం ‘పాస్‌పోర్ట్‌ సేవా’ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు సేవా కేంద్రాల అధికారులు, విదేశాంగ మంత్రిత్వశాఖ సభ్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. భారత దేశంలో ఎక్కడినుంచైనా పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేందుకు, మొబైల్‌ ఫోన్ల నుంచి పాస్‌పోర్టు అప్లికేషన్లు పూర్తి చేసుకునేందుకు వీలుగా రెండు పథకాలను సుష్మా స్వరాజ్‌ ప్రకటించారు. దీనిని పాస్‌పోర్టు విప్లవంగా ఆమె అభివర్ణించారు. హజ్‌ యాత్ర కోసం పాస్‌పోర్టులు, వీసాలు భారత ప్రజలకు నేరుగా అనుసంధానమయ్యే రెండు విషయాలని నేను భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. హజ్‌ యాత్ర మైనారిటీ వ్యవహారాల శాఖ కిందికి వస్తుండగా… పాస్‌పోర్టు జారీ బాధ్యత విదేశాంగ మంత్రిత్వ శాఖ చూసుకుంటోంది.
పాస్‌పోర్టు పరిశీలనలో అగ్రస్థానంలో తెలంగాణ
పాస్‌పోర్టు పరిశీలనలో రాష్ట్ర పోలీస్‌ శాఖ అగ్రస్థానంలో ఉందని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. సాంకేతికతలో నూతన విధానాలను తీసుకొచ్చామన్నారు. పాస్‌ పోర్టు సేవా దివస్‌ సందర్భంగా పాస్‌ పోర్టు వెరిఫికేషన్‌, జారీలో అత్యుత్తమ సేవలందిస్తున్నందుకు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ చేతులవిూదుగా డీజీపీ మహేందర్‌ రెడ్డి ఢిల్లీలో అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల కంటే ముందుగా కేవలం 4 రోజుల్లోనే పాస్‌పోర్టు పరిశీలిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు పాస్‌పోర్టు తీసుకోవడం సులభతరం చేశామన్నారు. పాస్‌పోర్టుకు సంబంధించి ‘వెరీ ఫాస్ట్‌’ యాప్‌ మూడేళ్లుగా వాడుతున్నట్లు చెప్పారు. పోలీసుల పరిశీలన తర్వాత వినియోగదారుల సలహా తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అందరికీ నాణ్యమైన సేవలు అందించేలా పోలీస్‌ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.