వేడెక్కిన కరీంనగర్ రాజకీయం
నేడు అమిత్ షా రాకతో బిజెపిలో ఉత్సాహం
కరీంనగర్,అక్టోబర్9(జనంసాక్షి): ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఇప్పటికే గులాబీ నేతలు ప్రచారంలో దిగగా, కాంగ్రెఉస్ అబ్యర్థులను ఖరారు చేయకున్న కొందరు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టారు. బిజెపి కూడా ఇప్పుడు సత్తా చాటేందుకు రంగం సిద్దం చేసింది.
బుధవారం జిల్లాలో అమిత్‌షా సభతో మరింత ఊపు వస్తుందన్న భావనలో ఉన్నారు. డిసెంబర్ 7న జరిగిఏ ఎన్నికల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుండగా.. ఈలోగా ప్రజాభిమానాన్ని చూరగొనేందుకు ఆయా రాజకీయ పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి మినహా అన్ని స్థానాలకూ టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను టీ పీసీసీ, ఏఐసీసీలకు డీసీసీ ద్వారా పంపించింది. అయితే జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి పోటీ ఖరారయ్యింది. మరికొందరు ఆశావహులు తమ స్థానాల్లో ప్రచారంలో ఉన్నారు. బీజేపీ కరీంనగర్ అభ్యర్థిగా బండి సంజయ్ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. మిగతా స్థానాల్లో ఈనెల 10న అమిత్ షా పర్యటన అనంతరం అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కూటమి చర్చలు నేడో, రేపో కొలిక్కి రానుండగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ పోటీచేసే స్థానాలు తేలంనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఐదారు స్థానాలపై వైఎస్సార్ సీపీ గురి పెట్టింది. సీపీఎం అలయెన్స్‌తో ఉన్న బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) ఇప్పటికే కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రెండో విడత జాబితాపై కసరత్తు చేస్తోంది. బీఎస్పీ, ఇతర పార్టీలు కూడా పోటీపై కసరత్తు చేస్తున్నాయి. అన్ని రాజకీయ పక్షాలు ఈరెండు నెలల సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని గెలుపే లక్ష్యంగా ముందుకు సాగేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.