వేల కోట్లు దోచుకున్న మంత్రులను వదిలి
న్యాయం కోసం కొట్లాడే న్యాయవాదులపై కేసులా ?
ఆ జీవో ఉపసంహరించుకోండి శ్రీ లేదంటే తెలంగాణ భగ్గుమంటది
సర్కారుకు కోదండరామ్ హెచ్చరిక
హైదరాబాద్, డిసెంబర్ 17 (జనంసాక్షి) :
వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దిగమింగిన మంత్రులను వదిలి న్యాయం కోసం పోరాడిన తెలంగాణ లాయర్లపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 24 మంది లాయర్లపై బనాయించిన కేసులపై ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు ఆదేశించడంపై కోదండరామ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ లాయర్లు హైకోర్టు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు కోదండరామ్, టీఎన్‌జీవో నేత శ్రీనివాస్‌గౌడ్ మద్దతు తెలిపారు. హైకోర్టు వద్ద ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను లాయర్లు తగలబెట్టేందుకు ప్రయత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అనంతరం లాయర్లు మదీన చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న అవినీతి మంత్రులపై ప్రాసిక్యూషన్‌కు అనుమతించని ప్రభుత్వం ఉద్యమకారులపై విచారణకు ఆదేశించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. అరెస్టులతో, అక్రమ కేసులు బనాయింపులతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకున్న మంత్రులపై ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా 24 మంది లాయర్లపై ప్రాసిక్యూషన్ జరపాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతూ ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో తెలంగాణ లాయర్లు చురుకైన పాత్ర పోషిస్తున్నారని, అందుకే వారిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని ఆయన ఆరోపించారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. ఉద్యమాన్ని ఎంత అణచాలని చూస్తే అంతా ఉవ్వేత్తున లేస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ భగ్గు మంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా తెలంగాణ లాయర్లు జీవోల కాపీలను దహనం చేశారు.