వ్యక్తిగతంగా కావేరీ ముసాయిదా సమర్పించాలి

– లేదంటే కేంద్రం కోర్టును ధిక్కరించినట్లే
చెన్నై, మే8(జ‌నం సాక్షి) : కావేరీ జలాల వివాదం కేసులో తాజాగా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. తమిళనాడులో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేసే విషయంలో మే 14న జల వనరుల శాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా ముసాయిదాను సమర్పించాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. అలా చేయకపోతే కేంద్రం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని స్పష్టం చేసింది. కావేరీ జలాల విషయంలో ఫిబ్రవరిలో సుప్రీం తీర్పు వెలువరిస్తూ తమిళనాడు కంటే కర్ణాటకకే ఎక్కువ నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో తమిళనాడులో ఆందోళనలు మిన్నంటాయి. రాష్ట్రంలో కావేరీ మేనేజ్‌మెంట్‌ బోర్డును ఏర్పాటుచేయాల్సిందిగా రాజకీయ నేతల నుంచి సినీ ప్రముఖుల వరకూ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీం స్పందిస్తూ.. మే 3లోగా కేంద్రం ముసాయిదాను ప్రవేశపెట్టాలని సుప్రీం పేర్కొంది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో కేంద్రం ముసాయిదాను ప్రవేశపెట్టలేకపోయింది. ఇప్పుడు ఇస్తున్నదానికంటే అదనంగా 4 టీఎంసీల నీటిని కర్ణాటక.. తమిళనాడుకు ఇవ్వాలని లేకపోతే పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సుప్రీం ఆదేశించింది. కానీ ఇందుకు కర్ణాటక ఒప్పుకోలేదు. దాంతో సుప్రీం తాజాగా పై విధంగా తీర్పు వెలువరించింది.