వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి * మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్
టేకులపల్లి, జూన్ 22( జనం సాక్షి ): ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్ సూచించారు . బుధవారం మండలంలోని మలేరియా ప్రభావిత గ్రామాలైన సంపత్ నగర్ ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభావిత గ్రామాల్లో నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి ఆదేశానుసారం లచ్చగూడెం గ్రామంలో దోమల నివారణ మందులు ఇంటింటికి పిచికారీ చేశారు. ఈ దోమల మందు ను స్థానిక సర్పంచ్ జోగ రేణుక చేతుల మీదుగా పిచికారి చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ మాట్లాడుతూ ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత తప్పనిసరిగా పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దోమల పెరుగుదలను అరికట్టవచ్చని, తద్వారా దోమల ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు ,బోదకాలు తదితర వ్యాధులను నివారించవచ్చని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్య క్రమాలు నిర్వహించాలని తెలిపారు. నీటి నిలువ ప్రదేశాల్లో ఆయిల్ బాల్స్ వేయాలని అలాగే పనికిరాని ఆయిలు వేయాలని, మట్టితో పూడ్చి వేయాలని ప్రజలను కోరారు. దోమతెరలు వాడాలని, దోమ కాయిల్స్ జెట్ లు వాడాలని, దోమలు ఇంట్లోకి రాకుండా వేపాకు పొగ లాంటివి వేసుకోవాలని, ఇంటిలోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా అమర్చుకోవాలని, నిండుగా బట్టలు వేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే జ్వర లక్షణాలు కనబడగానే వెంటనే సులా నగర్ హాస్పిటల్ లో వైద్య చికిత్స తీసుకోవాలని, చికెన్గున్యా, డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయి అని ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి పునేం స్వప్న, ఉప సర్పంచ్ సంపత్ లక్ష్మణ్, ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ ,సూపర్వైజర్లు పోరండ్ల శ్రీనివాస్, సిబ్బంది అరుణా దేవి, దనసరి రాంబాబు, సుగుణ, బుచ్చమ్మ ,లక్ష్మి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.