వ్యక్తిగత మరుగుదొడ్లకు అధిక ప్రాధాన్యం
ప్రతి కుటుంబానికి పథకం చేరేలా చర్యలు
కామారెడ్డి,ఫిబ్రవరి13(జనంసాక్షి): స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా నూరుశాతం స్వచ్ఛతను సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని కుటుంబాలన్నింటికీ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు అవకాశమిచ్చాయి. జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు కదిలితే శతశాతం సాధ్యమవుతుందని పలువురు
అభిప్రాయపడుతున్నారు. అధికారులు ప్రోత్సాహం అందించి, చైతన్యవంతం చేస్తే నిర్మాణాలు చేసుకునేందుకు లబ్దిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.గిరిజన తండాలు అధికంగా ఉన్న జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్మాణాలను ప్రోత్సహిస్తే శతశాతం సాధ్యమేనని అంటున్నారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అందిస్తున్నాయి. ఇందులో కేంద్రం వాటా రూ.7200 కాగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.4800. మరుగుదొడ్డి లేని కుటుంబాలు స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. రెండు విడతలుగా రూ.12వేలు లబ్దిదారుల ఖాతాలో జమ అవుతాయి. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు 46 శాతం కుటుంబాలకే ఉన్నాయి. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటివరకు 40వేల మరుగుదొడ్లు
మాత్రమే పూర్తయ్యాయి. దీనికి తోడు మరో 44వేల మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో పలువురు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టారు. వీరంతా బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేసుకున్న కుటుంబాలకు బిల్లుల చెల్లింపు త్వరితగతిన చేస్తేనే నిర్మాణాలు ముందుకు సాగుతాయని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.గ్రామాల్లో అధికారుల మధ్య సమన్వయం, అందుబాటులో ఉండకపోవడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. దీనిని నివారిస్తే నిర్మాణాలు ముందుకు సాగుతాయని గ్రామస్థులు పేర్కొన్నారు. నిర్మాణాలకు ఇసుకను ఉచితంగా పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని లబ్దిదారులు కోరుతున్నారు. ప్లలెలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ ఆదేశిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో సిరిసిల్లరాజన్న జిల్లా నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం చేసుకున్న జిల్లాగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటే గ్రామాల్లో ఆ వూసే కనిపించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో ఇంకా 99వేల కుటుంబాలు మల, మూత్ర విసర్జనకు ఆరుబయటకే వెళ్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛభారత్, స్వచ్ఛ తెలంగాణ వంటి కార్యక్రమాలకు విస్తృతంగా ప్రచారం కల్పించినా లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. వ్యయ ప్రయాసలకోర్చి మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికి సకాలంలో బిల్లులు అందడం లేదు. అధికారులు,
ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ పెడితేనే ఆరుబయట కష్టాలకు చెక్ పడుతుంది.