వ్యక్తి హత్య కేసులో సిద్దూకు వెయ్యి జరిమానా

న్యూఢిల్లీ,మే15(జ‌నం సాక్షి):  పంజాబ్‌ మంత్రి నవ్‌జోత్‌సింగ్‌ సిద్దూకి భారీ ఊరట లభించింది. 30 ఏళ్ల కిందటి వ్యక్తి మృతి కేసులో కేవలం వెయ్యి జరిమానాతో సిద్దూని సుప్రీంకోర్టు వదిలేసింది. దీంతో హత్య ఆరోపణల నుంచి సిద్దూకి విముక్తి లభించింది. జైలు శిక్ష విధించకపోవడంతో సిద్దూ మంత్రి పదవి సేఫ్‌గా ఉండనుంది. 1988, డిసెంబర్‌ 27న పటియాలా రోడ్డుపై ఓ వివాదంలో 65 ఏళ్ల గుర్నామ్‌ సింగ్‌ అనే వ్యక్తిని తలపై బలంగా కొట్టారు సిద్దూ. ఆ తర్వాత ఆ వ్యక్తి బ్రెయిన్‌ హేమరేజ్‌తో ఆసుపత్రిలో మరణించాడు. ఈ కేసులో సిద్దూని పంజాబ్‌, హర్యానా హైకోర్టు దోషిగా తేల్చింది. స్థానిక కోర్టు సిద్దూపై ఉన్న కేసును కొట్టేసినా.. 2006లో హైకోర్టు ఆయనను దోషిగా ప్రకటించింది. మూడేళ్లు జైలు శిక్ష కూడా విధించింది. అయితే 2007లో సుప్రీంకోర్టు ఈ శిక్షను సస్పెండ్‌ చేసి, సిద్దూకి బెయిల్‌ కూడా మంజూరు చేసింది. శిక్ష సస్పెండ్‌ కావడంతో అతను అమృత్‌సర్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం అప్పట్లో లభించింది. ఇప్పుడు కేవలం వ్యక్తిని గాయపరిచారన్న కేసులోనే సుప్రీంకోర్టు సిద్దూకి వెయ్యి జరిమానా విధించింది. ఆయనపై ఉన్న హత్య కేసును కొట్టేసింది.