వ్యక్త్యారాధనతోనే కాంగ్రెస్ ఓటమి : జేసీ
హైదరాబాద్, జూన్ 16(జనంసాక్షి): వ్యక్త్యారాధన వల్లే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం నాడు సిఎల్‌పి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చుట్టూ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రదక్షిణలు చేయడం వల్లనే జగన్‌కు మేలు చేకూరిందని అన్నారు. వైఎస్ పాల్పడిన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీలో లోపాలు తలెత్తాయని ఆయన అన్నారు. వైఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించిన కాంగ్రెస్ నేతలు వైఎస్‌ను మాత్రం పల్లెత్తు మాట అనకపోవడం జగన్‌కు లాభం చేకూర్చినట్టయిందని జేసీ అన్నారు. వైఎస్ చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే నని అన్నారు. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు వ్యక్తి ఆరాధనకు పాల్పడి, పార్టీ తీసుకున్న నిర్ణయాలు వైఎస్ చేపట్టినవిగా చిత్రీకరించడం పార్టీకి నష్టం కలిగించిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని వైఎస్‌ఆర్ పట్ల పార్టీ తగిన రీతిలో స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే ప్రజల వైఖరిలో స్పష్టత వస్తుందని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని, పార్టీలోని నేతలంతా ఓటమిపై సమీక్ష జరిపి ప్రజల్లోకి వాస్తవాలను తీసుకెళాల్సిన అవసరం ఉందని అన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం సానుభూతితోనే గెలిచారని అన్నారు. ఏదీ ఏమైనా ఈ ఉప ఎన్నికలు ఫలితాలు గుణపాఠంగా తీసుకొని పార్టీ వైఖరి పట్ల స్పష్టతను ప్రదర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని ఆయన అన్నారు. రెడ్డి సామాజిక వర్గం అంతా జగన్‌వైపే వెళ్లిందని వస్తున్న వార్తలను జేసీ ఖండించారు. రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీతోనే ఉందని ఆయన అన్నారు. ఆసలు జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడే కాదని, క్రిస్టియన్ కమ్యూనిటీకి చెందినవాడని ఆయన అన్నారు. కులాల గురించి ప్రస్తావన చేయాల్సిన అవసరం తనకు లేదని అయినా రెడ్డి సామాజిక వర్గం జగన్ వైపు వెళ్లిందని వస్తున్న అవాస్తవ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకే తాను ఈ విధంగా స్పందించాల్సి వచ్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆసలైన రెడ్డి కులానికి చెందిన వారని జేసీ అన్నారు.