వ్యవసాయేతర భూములకు .. పాతపద్ధతిలో రిజస్ట్రేషన్లకు ఓకే

 

– హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌,డిసెంబరు 10 (జనంసాక్షి): తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయేతర ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో సీఎం కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ధరణి పోర్టల్‌ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. రిజిస్ట్రేషన్లపై స్టే ఇవ్వలేదని స్పష్టం చేసింది. వ్యవసాయేతర ఆస్తులను గతంలో మాదిరే కంప్యూటర్‌ ఆధారిత విధానంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.ధరణి పోర్టల్‌ లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయమై గురువారం తెలంగాణ హైకోర్టు విచారించింది. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు అభ్యంతరం లేదన్న ధర్మాసనం తేల్చి చెప్పింది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా సీఏఆర్‌డీ పద్దతి కొనసాగించాలని పిటిషన్‌ తరపు న్యాయవాదులు కోరగా.. ఆన్‌ లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ గతంలో లాగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విదంగా చూడలని అడ్వొకేట్‌ జనరల్‌ విజ్ఞప్తి చేశారు. రిజిస్ట్రేషన్‌కు ప్రోపర్టీట్యాక్స్‌ గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉండాలని వాదించారు.హైకోర్టు ఎలాంటి స్టే ఇవ్వకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లను ఆపిందని పిటిషనర్‌ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి వివరించారు. ధరణి వివరాలు మాత్రమే ఆపాలని చెప్పామని, రిజిస్ట్రేషన్‌పై ఎలాంటి స్టేలు ఇవ్వలేదని హైకోర్టు స్పష్టం చేసింది. స్లాట్‌ బుకింగ్‌తోపాటు పీటీఐఎన్‌ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించింది. ధరణి పోర్టల్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అనంతరం తతుపరి విచారణను డిసెంబర్‌ 16కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఓకే

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో రేపటి నుంచి వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.. దీనిపై సీఎస్‌ సోమేశ్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రిజిస్ట్రేషన్‌ కోసం ముందుగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకునే విధానానికి హైకోర్టు అనుమతించింది. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య కచ్చితంగా ఉండాలనే నిబంధనకు ఉన్నత న్యాయస్థానం సమ్మతించింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.