వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెమినార్‌


గుంటూరులో 29,30 తేదీల్లో నిర్వహణకు సన్నాహాలు
గుంటూరు,ఆగస్ట్‌23(జనంసాక్షి): కేంద్రం చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గుంటూరులో 29,30 తేదీలలో జరిగే జాతీయ సెమినార్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు సెమినార్‌ను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, ఎం.ఎల్‌.సి. కెఎస్‌.లక్ష్మణరావు తెలిపారు. గుంటూరులోని గీతా రేజెన్సీలో సోమవారం ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ’రైతు వ్యతిరేక చట్టాలు ` వ్యవసాయం, ప్రజలపై ప్రభావం’ అనే అంశంపై జాతీయ సెమినార్‌ జరుగుతుందన్నారు. గత 9నెలలుగా ఉత్తర భారతదేశంలో వ్యవసాయ నల్ల చట్టాలకి వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకి మద్దతుగా కౌలు రైతులతో పాటు మొత్తం రైతాంగానికి ఈ చట్టాల గురించి అవగాహన కల్పించడంతో పాటు ఈ చట్టాలు రద్దు అయ్యేవరకు పోరాటాన్ని ఉదృతం చేయడానికి ఈ సెమినార్‌ ఉపయోగపడుతుందన్నారు. ఈ సెమినార్‌ లో ముఖ్య వక్తగా ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు, ఆలిండియా కిసాన్‌ సభ జాతీయ సహాయ కార్యదర్శి విజు కృష్ణన్‌, హైదరాబాద్‌ సెస్‌ మాజీ డెరైక్టర్‌ ఎస్‌. గాలబ్‌, రిటైర్డు ప్రొఫెసర్‌ ఎన్‌. వేణుగోపాలరావు, రాష్ట్ర కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య తదితరులు ప్రసంగిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సెమినార్‌ పోస్టర్‌ లను ఆవిష్కరణ చేశారు. విూడియా సమావేశంలో ఆహ్వాన సంఘం నాయకులు బైరగాని శ్రీనివాసరావు, వై. రాధ కృష్ణ, ఈమని అప్పారావు, మహామద్‌ చిస్టి, కె. అజయ్‌ కుమార్‌, దండా లక్ష్మి నారాయణ, టీ. కృష్ణ మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.