వ్యవసాయ రసాయనాలతో ముప్పు

విషగుళికలకు నెమళ్లు మృత్యువాత

మహబూబ్‌నగర్‌,జూలై27(జ‌నం సాక్షి): రైతులు వ్యవసాయపొలాల్లో చల్లే రసాయనాలు, విషగుళికలు పక్షుల ప్రాణాల విూదికి వచ్చింది. వీటితో కూడిన నీటిని తాగి అవి మృత్యువాత పడుతున్నాయి. తాజాగా నాగర్‌కర్నూల్‌ మండలం గగ్గళ్లపల్లి వద్ద పంటపొలాల్లో 5 నెమళ్లు మృతి చెందాయి. పంటపొలాల్లో మృతి చెందిన నెమళ్లను చూసి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పరీక్షల కోసం మృతి చెందిన నెమళ్లను నాగర్‌కర్నూల్‌ పశువైద్య ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.జోగుళాంబ, నాగర్‌ కర్నూల్‌ జిల్లాల్లో పది రోజుల వ్యవధిలో 25 నెమళ్లు మృత్యవాతపడ్డాయి. పంటలపై రైతులు అధిక మొత్తంలో క్రిమి సంహారక మందులు పిచికారి చేయడంతో ఆ గింజలను తిని మృతి చెంది ఉంటాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. నెమళ్ల కళేబరాలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెమళ్లు కనిపిస్తే అటవీ శాఖ అధికారులకు రైతులు సమాచారమివ్వాలని తెలిపారు. పరీక్షల నిమిత్తం నాగర్‌ కర్నూలు పశువైద్య ఆస్పత్రికి వాటి కళేబరాలను తరలించారు.