శభాష్ కరీంనగర్ పోలీస్
* పోలీసుల మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
* 70 మల్టీ నేషనల్ కంపెనీల ప్రాతినిధ్యం
* 3 వేల ఉద్యోగావకాశాలు
కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి ) :
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు తీసుకున్న చొరవ కు అన్ని వర్గాల ప్రజల నుండి శభాష్ కరీంనగర్ పోలీస్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్ కమీషనరేట్ పోలీసులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. కరీంనగర్ లోని పద్మనాయక కళ్యాణ మండపం ఆవరణలో ఈ జాబ్ మేళా ను నిర్వహించారు.
70 కి పైగా మల్టీ నేషనల్ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రతినిధులు విచ్చేసి ఇంటర్వ్యూలను నిర్వహించారు. 3వేల మందికు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు నిర్వహించిన ఈ మేళాకు 5 వేలకు పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ కొనసాగింది. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, బిటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, నర్సింగ్ విభాగాల్లో విద్యార్హతలు కలిగి ఉన్న యువత ఈ జాబ్ మేళాకు హాజరయ్యారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో ఉద్యోగాల నియామకం కోసం కూడా ఇంటర్వ్యూలు జరిగాయి.
* 3వేల ఉద్యోగ అవకాశాలు
ఈ సందర్భంగా పైన పేర్కొన్న విభాగాల్లో 3 వేల మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి నియామక పత్రాలను అందజేశారు. ఎంపికైన అనేకమందికి విద్యాభ్యాసం కొనసాగించేందుకు కూడా సమయాలు లభించే ఉద్యోగాలు లభించాయి.
* జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలి
* రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నిరుద్యోగులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితాలను ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. 20 నుండి 30% వరకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని మిగతా 70 శాతం అవకాశాలు ప్రైవేటు రంగాల్లో ఉంటాయని తెలిపారు. ఒకపక్క శాంతిభద్ర విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే మరోపక్క కమీషనరేట్ పోలీసులు నిరుద్యోగుల కోసం ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించడం అభినందనీయమన్నారు. శాంతియుత వాతావరణం నిర్మాణం ద్వారానే అభివృద్ధి ముందుకు సాగుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఓకే వేదికపై నుండి వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు పోలీస్ శాఖ ఈ కార్యక్రమం నిర్వహించడం గర్వకారణం అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఉద్యోగ,ఉపాధి అవకాశాలను సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తులు చేసిన సందర్భాల్లో 5 నుండి 10 గంటల పాటు ఏకాగ్రతతో చదివినట్లయితే విజయం సాధిస్తారని చెప్పారు. పట్టుదలతో ప్రయత్నించకపోతే ఏది సాధించలేరని పేర్కొన్నారు.
పోలీస్ కమీషనర్ వి సత్యనారాయణ మాట్లాడుతూ యువత సమయాన్ని వృధా చేయకూడదన్నారు. పాశ్చాత్తా దేశాల్లో యువత విద్యాభ్యాసాలు పూర్తయిన తర్వాత ఎవరిపై ఆధారకుండా పట్టుదలతో ప్రయత్నించి ఉద్యోగాలను సాధించి జీవితాల్లో స్థిరపడుతారని చెప్పారు. అత్యున్నత స్థానాల్లో కొనసాగేందుకు కృషి చేయాలని తెలిపారు. భాషా పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని సూచించారు. ప్రయోజకులై తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై సునీల్ రావు, కార్పొరేటర్ తోట రాములు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రాజు, అడిషనల్ డిసిపిలు ఎస్ శ్రీనివాస్ (ఎల్ అండ్ ఓ) జి చంద్రమోహన్ (పరిపాలన) ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్ రావు, విజయకుమార్, సి ప్రతాప్, ఎస్బిఐ జి వెంకటేశ్వర్లతో పాటు పలువురు పోలీసు అధికారులు, ఎన్ సిసి క్యాడేట్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కో-ఆర్డినేటర్లుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ & మోటివేటర్ స్పీకర్ రఘురామరాజు, చందర్ లు వ్యవహరించారు.