శాంతించిన మూసీ నది

జంటజలాశయాలకు తగ్గినవరద
ఊపిరి పీల్చుకున్న మూసీ పరివాహక ప్రజలు

హైదరాబాద్‌,జూలై28(జనంసాక్షి ): హైదరాబాద్‌లో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు, మూసీ ఉధృతి కూడా తగ్గింది. ఒక్కరోజంతా హైరాన పెట్టిన మూసీ తగ్గుముకం పట్టడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉస్మాన్‌ సాగర్‌లోకి 3వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, హిమాయత్‌ సాగర్‌ కు 400 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఉస్మాన్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా….. 1787 అడుగులకు చేరింది. దీంతో అధికారులు పది గేట్ల ద్వారా మూసీలోకి 6వేల 90 క్యుసెక్కుల నీటిని వదులుతున్నారు. మరోవైపు హిమాయత్‌ సాగర్‌ కి ఇన్‌ ప్లో భారీగా తగ్గుతున్నట్టు అధికారులు ప్రకటించారు. హిమాయత్‌ సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 1763 అడుగులు కాగా… ఇప్పటికే 1760 అడుగులకు చేరింది. దీంతో హిమాయత్‌ సాగర్‌ ఒకగేట్‌ ద్వారా మూసీలోకి 330 క్యూసెక్కుల నీటిని వదలుతున్నట్టు పేర్కొన్నారు. బుధవారం జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరగడం వల్ల మూసీ ఉగ్రరూపం దాల్చింది. భారీ వరదలతో మూసీ చుట్టుపక్కల బస్తీలు, కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటు గడిపారు. స్థానికులను జీహెచ్‌ఎంసీ, పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌, మూసారంబాగ్‌ వంతెనలు, హిమాయత్‌నగర్‌, మంచిరేవుల కాలినడక వంతెనలపై నుంచి వరద పొంగడంతో కొన్ని గంటలపాటు రాకపోకలను నిలిపివేసి, ప్రవాహం తగ్గాక పునరుద్ధరించారు.
హైదరాబాద్‌లో ఉప్పొంగుతున్న మూసీ నదితో పరివాహక ప్రాంత ప్రజల భయం గుప్పిట్లో మగ్గుతున్నారు. జంట జలాశయాలకు భారీ వరదలతో పొంగిపొర్లుతున్న మూసీ…. వంతెనలను, పరివాహక ప్రాంతంలోని
కాలనీలను ముంచెత్తుతోంది. భారీ వర్షాలకు చెరువులు ఇప్పటికే నిండుకుండల్లా మారటంతో దిగువనున్న బస్తీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధి, వికారాబాద్‌, అనంతగిరి కొండల్లో భారీవర్షం కురవడంతో జంటజలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ల్లోకి వరద పోటెత్తింది. ఈ రెండిరటిలోకి బుధవారం సాయంత్రానికి 15 వేల క్యూసెక్కుల వరద రాగా.. వచ్చిన దాన్ని వచ్చినట్లు అధికారులు దిగువకు విడిచి పెట్టారు. ఉస్మాన్‌సాగర్‌లోకి రికార్డు
స్థాయిలో వరద చేరింది. దాదాపు దశాబ్దం తర్వాత 15 గేట్లలో 13 గేట్లను ఆరడుగుల మేర ఎత్తడం గమనార్హం. 2020 అక్టోబరు నాటి వరదల్లో హిమాయత్‌సాగర్‌లోకే భారీగా వరద చేరడంతో మూసీలోకి విడిచిపెట్టారు. ప్రస్తుతం హిమాయత్‌సాగర్‌లో 17 గేట్లకు.. 8 గేట్లను 3 అడుగుల మేర ఎత్తి జలాలను కిందికి విడిచిపెట్టారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు జలమండలి ఎండీ దానకిషోర్‌, వివిధ శాఖల అధికారులు జంటజలాశయాలను పరిశీలించారు. బుధవారం రాత్రికి వరద తగ్గుముఖం పట్టింది. మరోవైపు భారీ వరదలతో మూసీ చుట్టుపక్కల బస్తీలు, కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమన్నారు. స్థానికులను జీహెచ్‌ఎంసీ, పోలీసులు ఎక్కడికక్కడ అప్రమత్తం చేశారు. చాదర్‌ఘాట్‌, మూసారంబాగ్‌ వంతెనలు, హిమాయత్‌నగర్‌, మంచిరేవుల కాలినడక వంతెనలపై నుంచి వరద పొంగడంతో కొన్ని గంటలపాటు రాకపోకలను నిలిపివేసి, ప్రవాహం తగ్గాక పునరుద్ధరించారు.

తాజావార్తలు