శాంతిభద్రతలను విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
జిల్లా ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు
మహబుబ్ నగర్ ,అక్టోబరు 12,(జనంసాక్షి ):
శాంతిభద్రతల పరిరక్షణకై పోలీస్ పోలీసు శాఖ చిత్తశుద్ధితో పని చేస్తుందని, సంఘ వ్యతిరేక శక్తులు, అల్లరి మూకపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్.పి. శ్రీ ఆర్.వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన శాంతిభద్రతల సమీక్ష సమావేశంలో ఎస్.పి. మాట్లాడుతూ, సమస్యలను సృష్టించే వ్యక్తులను గుర్తించి గట్టి నిఘా ఉంచాలని ఆదేశించారు. నేరాల నియంత్రణకుగానూ సిబ్బంది అప్రమత్తంగా ఉండడంతో పాటుగా ప్రజలనూ చైతన్యం చేయడం అవసరమని ఎస్.పి. పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న జాతీయ రహదారి మరియు ఇతర మార్గాలలో రోడ్డు ప్రమాదాల నివారణకుగానూ ఏర్పాటు చేసిన స్టాపర్ లు, తీసుకున్న ఇతర చర్యలు సత్ఫలితాలు ఇవ్వడం పట్ల ఎస్.పి. సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ విషయంలో మరింతగా కృషి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా జిల్లాలో అక్కడక్కడ జరుగుతున్న మత్తు పదార్థాల వాడకాన్ని నిరోధించడంలో అధికారులు, సిబ్బంది కృషిని అభినందించారు. సమావేశంలో పోలీసు స్టేషన్ల వారీగా నేరాల వివరాలను, దర్యాప్తు జరుగుతున్న తీరును ఎస్.పి. అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ పూర్తి చేయడం, నిందితులకు కోర్టుల ద్వారా శిక్ష ఖరారు అయ్యేందుకు తగిన ఆధారాలు సేకరించడంలో వృత్తి నైపుణ్యాలను చూపాలని అన్నారు. కార్డన్ సెర్చ్, వాహనాల తనిఖీలు నిర్వహించడం, సైబర్ నేరాల నివారణ, సి.సి. కెమెరాల ఏర్పాటుకు ప్రజలలో అవగాహన కల్పించడంలో గ్రామ పోలీస్ అధికారులు చురుకుగా ఉండాలని తెలిపారు. బాలలు, మహిళలపై నేరాల నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తూ, ప్రజలకు పోలీసు సహాయం అవసరమైనప్పుడు డయల్ 100 నెంబర్ కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలనే విషయం పైన ప్రచారం చేయాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా సిబ్బంది తీసుకున్న ముందు జాగ్రత్తలను ఎస్.పి. అభినందించారు.
సమావేశంలో అదనపు ఎస్.పి. శ్రీ ఎ.రాములు గారు, డిఎస్.పి.లు మహేష్, రమణారెడ్డి, లక్ష్మణ్, శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్లు, ఎస్.ఐ.లు పాల్గొన్నారు.