శాంతియుత ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూస్తున్నరు..
తెలంగాణ రాకుండా చెయ్యాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు చేస్తున్నరు..
రాష్ట్రం ఇవ్వకుండా పాలకులు హక్కులను కాలరాస్తున్నరు..
‘ప్రాణహిత’ పుస్తకావిష్కరణలో కోదండరాం ఆగ్రహం
హైదరాబాద్, ఆగస్టు 19 (జనంసాక్షి) :
శాంతియుతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని, తెలంగాణ రాష్ట్రం రాకుండా చెయ్యాలని సీమాంధ్ర నాయకులు కుట్రలు చేస్తున్నారని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం కన్వీనర్, ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఎడిటర్ అల్లం నారాయణ ఇప్పటి వరకు ‘ప్రాణహిత’ పేరిట రాసిన వ్యాసాల సంకలనం ‘ప్రాణహిత’ పుస్తకావిష్కరణ సభ ఆదివారం తెలుగు వర్సిటీలో అట్టహాసంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై కోదండరాం పుస్తకావిష్కరణ అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య యావత్ తెలంగాణ ప్రజలు ఉద్యమిస్తున్నా, తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేస్తూ కేంద్రం ఇక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్నదని మండిపడ్డారు. సీమ నాయ కులు, బడా వ్యాపారులు ఉద్యమాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, సకల జనుల సమ్మె కాలంలో ఇదే జరిగిందని ఆయన విమ ర్శించారు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణపై సానుకూల ప్రకటన చేసి, ఇక్కడి ప్రజల మనోభావాలను గౌరవించాలని సూచించారు. వెంటనే ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ప్రాణహిత పుస్తకం గురించి కోదండరాంతోపాటు సాక్షి దినపత్రిక ఎడిటర్ మురళి, ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె.శ్రీనివాస్, హన్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్, విప్లవ రచయిత వరవరరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తరుపున అల్లం నారాయణ ఉద్యమిస్తున్న తీరు అద్భుతమని అభినందించారు. తెలంగాణ సాధన ఉద్యమ సందర్భంలోని అనేక అంశాలపై అల్లం నారాయణ రాసిన వ్యాసాలు ఉత్తేకజపూరితంగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగమవుతూనే, ఓ జర్నలిస్టుగా తెలంగాణ ప్రజల ఆవేదనను అక్షర రూపం ఇచ్చిన అల్లం నారాయణ చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. అనంతరం పుస్తక రచయిత అల్లం నారాయణ మాట్లాడుతూ తాను ‘ప్రాణహిత’ పేరిట రాసిన వ్యాసాలకు పుస్తక రూపం ఇవ్వాలని ఏనాడూ అనుకోలేదని, ఇందుకు తనను ప్రోత్సహించిన తన సహచర సంపాదకులు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.