శాఖ మార్పు వల్ల బాధలేదు : జైపాల్‌రెడ్డి ,అవినీతిపరులకే కేంద్రం పట్టం :కేజ్రీవాల్
న్యూఢిల్లీ, అక్టోబర్ 29 (జనంసాక్షి):
శాఖమార్పు వల్ల తనకు ఎలాంటి బాధ లేదని జైపాల్‌రెడ్డి అన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖమంత్రిగా జైపాల్‌రెడ్డి సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్రోలియం శాఖమంత్రి అయినప్పుడు సంతోషంగా లేను.. పోయినందుకు దుఃఖం లేదని వ్యాఖ్యానించారు. నిజాయితీగల రాజకీయ నాయకుడికి దేనివల్ల నష్టం ఉండదన్నారు. తనకు ఈ శాఖ కేటాయించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. విధేయుడైన పార్టీ కార్యకర్తగా నిజాయితీతో పని చేస్తానని చెప్పారు. ఎనిమిది వేల మంది శాస్త్రవేత్తలతో పనిచేసే పెద్దపీట వేశామన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్ పనితీరు సంతృప్తికరంగా ఉందని జైపాల్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ అంశంపై తన అంచనాలు అధిష్ఠానానికి ఎప్పుడో తెలియజేసినట్లు చెప్పారు. కేంద్రమంత్రివర్గంలో అవినీతి పరులకే ప్రాధాన్యత ఇచ్చారని కార్యకర్త కేజ్రీవాల్ ఆరోపించారు. నిజాయితీగా పనిచేసిన జైపాల్‌రెడ్డిని పెట్రోలియం శాఖ నుంచి తప్పించి ప్రాధాన్యతలేని శాఖను ఇచ్చారన్నారు. అవినీతి పరుడైనటువంటి సల్మాన్ కుర్షిద్‌కు మరింత కీలక శాఖ అయినటువంటి విదేశాంగ శాఖను అప్పజెప్పారని కేజ్రీవాల్ విమర్శించారు. రిలయన్స్ సంస్థ లాబీయింగ్ తోనే జైపాల్‌రెడ్డిని పెట్రోలియం శాఖనుంచి తప్పించారని ఆయన ఆరోపించారు.