శివసేనకు మద్దతు ఇవ్వడంలో తప్పులేదు

బిజెపికి కేంద్రమంత్రి అథవాలే సూచన

న్యూఢిల్లీ,నవంబరు18 (జనం సాక్షి) :  మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో విసేనకు సిఎం పీఠం అప్పగించడం సరైన నిర్ణయమని కేంద్రమంత్రి, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ రామ్‌దాస్‌ అంథ్‌వాలే అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇచ్చేలా బీజేపీ నాయకత్వంలో ఆలోచన చేయాలని సలహా ఇచ్చారు. శివసేనకు కొన్నేళ్ల పాటు సీఎం పదవిని ఇచ్చి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సందర్భంగా దీనిపై చర్చిచేందుకు బిజెపి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మిత్రపక్షం శివసేన మద్దతు తీసుకున్నప్పుడు, ఇప్పుడు మద్దతు ఇవ్వడంలో తప్పులేదని అభిప్రాయపడ్డారు. అంథ్‌వాలే విూడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర సీఎం పీఠాన్ని శివసేనకు ఇవ్వడంలో తప్పేవిూలేదని అన్నారు. దీనిపై బీజేపీ మరోసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. కాగా సీఎం పీఠం పంపకంపై మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ-శివసేన మధ్య విభేదాలు ఏర్పడిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందుకు కూటమిగా పోటీచేసిన రెండు పార్టీలు అనంతరం పదవుల పంపకాలపై పట్టుబట్టాయి. సీఎం కుర్చీని శివసేనకు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన పావులు కదుపుతోంది.