శివసేన హత్య కేసులో గావ్లీకి జీవత ఖైదు
ముంబయి: ముఠా నాయకుడు నుంచి రాజకీయ నేతగా మారిన ఆరుణ్ గావ్లీకి శివసేన కార్పొరేటర్ కమలాకర్ జంసందేకర్ హత్య కేసులో మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం (మోకా) ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తి పృధ్వీరాజ్ చవాన్ తీర్పు వెలువరించారు. గావ్లీ రూ. 17 లక్షల జరిమానా కూడా చెల్లించాలని, లేని పక్షంలో అదనంగా మరో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. కేసులో మరో పది మందికి కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది. ఓ భూ వివాదానికి సంబంధించి 2008లో శివసేన కార్పొరేటర్ కమలాకర్‌ను హతమార్చేందుకుగాను ఇద్దరు వ్యక్తులు గావ్లీ ముఠాకు రూ.30 లక్షలు ముట్టజెప్పినట్లు దర్యాప్తు అధికారులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. ఈ కేసులో గావ్లీ 2008, మే 21న అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి కస్టడీలోనే ఉన్నారు.