శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడు
బహు అరుదైన శైవ క్షేత్రం సిద్దేశ్వరం
అనంతపురం,నవంబర్19(జనంసాక్షి): భారత దేశంలో శివుడు సాధారణంగా లింగరూపంలో మనకు దర్శనమిస్తాడు. అయితే అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అందులోనూ సిద్ధాసనంలో శివుడు కొలవై ఉన్న క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అమరాపురం మండలం హేమావతిలోని సిద్ధేశ్వరాలయంలో కనిపిస్తాడు. ఇక స్వామివారి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడు కూడా ఉండటం ఇక్కడ విశేషం. అంతేకాకుండా ఇక్కడ ప్రతి శివరాత్రి రోజూ సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు స్వామివారి నుదుటను తాకుతాయి. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ క్షేత్రం….సిద్ధాసనంలో శివుడు కొలువై ఉండటం వల్ల ఈ ఆలయానికి సిద్దేశ్వరాలయం అని పేరు వచ్చింది. ఇక స్వామివారు జఠాజూటంలో చంద్రుడితో పాటు సూర్యుడు కూడా కనిపిస్తారు. కుడిచేతిలో బ్రహ్మ కపాలాన్ని, మెడలో కపాలాలను కూడా స్వామి వారు ధరించి సంగం మూసిన కనులతో స్వామివారు కనిపిస్తారు.ఇటువంటి రూపం భారత దేశంలో ఇదొక్కటే అని స్థానికులు చెబుతున్నారు. ఇదే ఆలయంలో పంచ లింగాలు కూడా మనం చూడవచ్చు. శివరాత్రి రోజు సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు ఈ దేవాలయంలోని మూల విగ్రహం నుదిటివిూద ఖచ్చితంగా పడుతాయి. ఇలా ఎలా పడుతున్నయన్న దానికి ఇప్పటి వరకూ ఖచ్చితమైన సమాధానం లేదు. ఇక ఆలయంలో శివుడికి ఎదుగా ఉన్న నంది స్వామివారిని చూస్తున్నట్టు గా కాక కొంత పక్కకు తిరిగి ఉంటుంది. పడమర ముఖంగా ప్రవేశ ద్వారం ఉన్న దేవాలయాల్లో హేమావతి సిద్దేశ్వరస్వామి దేవాలయం కూడా ఒకటి.హేమావతిని పూర్వ కాలంలో హెంజేరుగా పిలిచేవారు. కాలక్రమంలో అది హేమావతిగా మారింది. పూర్వం ఈ ప్రాంతాన్ని నోలంబరాజులు పరిపాలించేవారు. అందువల్ల హేమావతిలోని సిద్దేశ్వరుడిని నోలంబేశ్వరుడు, ఎంజేరప్ప అని కూడా అంటారు.అనంతపురం ? హిందూపురాల కు రైల్వే సౌకర్యం ఉంది. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హేమావతిని చేరుకోవచ్చు. పలు ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు ఉన్నాయి. అనంతపురం నుంచి ఇక్కడకు 150 కిలోవిూటర్ల దూరం. అదేవిధంగా హిందూపురం నుంచి హేమావతికి 69 కిలోవిూటర్ల దూరం.ఉదయం 7 గంటలు నుండి సాయంత్రం 7 గంటలు వరకు ఆలయం తెరిచి ఉంటుంది.