శుబ్‌మన్ గిల్ విషయంలో ఆర్‌సీబీ తప్పుడు ట్వీట్
టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ విషయంలో ఆర్‌సీబీ తప్పుడు ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో శుబ్‌మన్ గిల్ 98 బంతులెదుర్కొని వంద స్ట్రైక్‌రేట్‌తో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. వర్షం అంతరాయం గిల్‌ను సెంచరీ చేయకుండా ఆపేసింది. అలా కేవలం రెండు పరుగుల దూరంలో అతను వన్డేల్లో మెయిడెన్ సెంచరీని చేసే అవకాశం కోల్పోయాడు. అయితే గ్రౌండ్‌ను చక్కగా ఉపయోగించుకున్న గిల్ బౌండరీలు, సిక్సర్లతో మెరిశాడు.గిల్ ఇన్నింగ్స్ చూసి ముచ్చటపడిన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్‌సీబీ అత్యుత్సాహంలో తప్పుడు ట్వీట్ చేసింది. వన్డేల్లో తొలి సెంచరీ అందుకున్న శుబ్‌మన్ గిల్‌కు కంగ్రాట్స్.. ఇది నీ కెరీర్‌లో ఒక పర్‌ఫెక్ట్ ఇన్నింగ్స్ అంటూ ట్వీట్ చేసింది. అయితే ట్వీట్ చేసిన రెండు నిమిషాలకే మళ్లీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే యూత్ వెంటనే ఆర్‌సీబీ పెట్టిన ఫోటోను స్క్రీన్‌షాట్లు తీసి ఫన్నీగా ట్రోల్ చేశారు.అయితే ఎవరు ఆర్‌సీబీని వెటకారంగా ట్రోల్ చేయలేదు. ఎందుకంటే శుబ్‌మన్ గిల్ సెంచరీ చాన్స్ మిస్సయినప్పటికి తన కెరీర్‌లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ”ఆ అత్యుత్సాహంలో ఆర్‌సీబీ.. గిల్ సెంచరీ చేశాడనుకొని పొరబడి ఉంటుంది.. ఒక్కోసారి ఇలాంటివి జరుగుతుంటాయి.. పట్టించుకోవద్దు” అంటూ పేర్కొన్నారు.మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో వరుణుడు రెండుసార్లు అడ్డు తగలడంతో మ్యాచ్‌ను 36 ఓవర్లకు కుదించారు. గిల్‌తో పాటు కెప్టెన్ శిఖర్ ధావన్ కూడా అర్థ సెంచరీ చేయడం.. శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులతో ఆకట్టుకోవడంతో 36 ఓవర్లలో 225 పరుగులు చేసింది. డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో భారత జట్టు నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో 137 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 119 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ 42, నికోలస్ పూరన్ 42, హోప్ 22 పరుగులు చేశారు. భారత బౌలర్లలో చహల్ 4, సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణా చెరో వికెట్ తీసుకున్నారు. ఇక వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ విజయంపై కన్నేసింది. జూలై 29 నుంచి ఇరుజట్ల మధ్య తొలి టి20 మ్యాచ్ జరగనుంది.