శెభాష్‌.. లక్ష్మీశ్రీజ

♦ చిన్నారి ధారణ శక్తికి ముగ్ధుడైన సీఎం కేసీఆర్
♦ సొంత ఖాతా నుంచి రూ.10 లక్షలు అందజేత
♦ ఇంటికి భోజనానికి వస్తానని హామీ
3

ఖమ్మం జిల్లాకు చెందిన మూడో తరగతి చదువుతున్న చిన్నారి వి.లక్ష్మీశ్రీజ ప్రతిభకు సీఎం కేసీఆర్ ముగ్ధుడయ్యారు. ఆమెకు తన వ్యక్తిగత ఖాతా నుంచి రూ. 10 లక్షల 16 వేల రూపాయలు బహుమతిగా ఇచ్చారు. బాగా చదువుకోవాలని ఆశీర్వదించారు. వాళ్ల ఇంటికి భోజనానికి వస్తానని మాటిచ్చారు.
లక్ష్మీశ్రీజ తన తల్లిదండ్రులతో కలిసి ఇవాళ హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసానికి వచ్చింది. తెలంగాణ చరిత్ర, ఉద్యమం, తెలంగాణ ఉద్యమ నేపథ్యం, తెలంగాణ మంత్రులు, వారి శాఖలు తదితర అంశాలపై అనర్గలంగా చెప్పింది. కాకతీయ రాజుల కాలం నాటి స్వర్ణయుగం, శాతవాహనుల పాలన, నిజాం నవాబుల గొప్పదనం, స్వాతంత్ర్యానంతర పరిస్థితి, మొదటి ఎస్సార్సీ, సమైక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, 1969 ఉద్యమం, కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఉద్యమం, మంత్రుల బృందం ఏర్పాటు, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్, అపాయింటెడ్ డేట్, తెలంగాణ ఏర్పాటు తదితర వివరాలను గుక్క తిప్పుకోకుండా చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి, ఆయన పాలన దక్షత గురించి వివరించింది. ఏ పేరున నను దయతలిచెదవో అని ప్రజలు కోరగానే కోర్కెలు తీర్చే నాయకుడు కేసీఆర్ అని కొనియాడింది.
లక్ష్మీశ్రీజ వెంట ఆమె తల్లిదండ్రులు సుధారాణి, కిరణ్ కుమార్ ఉన్నారు.