శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎస్కార్ట్ జీపు టైరు పేలి నలుగురు పోలీసుల మృతి
తీవ్ర దిగ్భార్రతిని వ్యక్తం చేసిన సిఎం జగన్
ఘటనా స్థలం చేరుకున్న మంత్రి అప్పలరాజు
పోలీసలు దుర్మణం పోలీస్ శాఖకు తీరని లోటన్న డిజిపి
శ్రీకాకుళం,అగస్టు23(జనంసాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం సుమ్మాదేవి రైల్వే గేటు దగ్గర జీపు టైరు పేలడంతో నలుగురు ఎస్కార్ట్ పోలీసులు దుర్మరణం చెందారు. వారు ఏఆర్ కానిస్టేబుళ్లుగా గుర్తించారు. వారు ఓ ఆర్మీ జవాను అంత్యక్రియల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న వాహనం టైరు పేలి, అదుపు తప్పి పక్కనే ఉన్న డీవైడర్‌ను ఢీ కొట్టింది. ఎస్‌ఐ కృష్ణం నాయుడు హెడ్ కానిస్టేబుల్స్ జనార్థనరావు, ఆంటోనీ, కానిస్టేబుల్ బాబూరావులు అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏఆర్ పోలీసుల దుర్మరణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా ప్రమాద ఘటనపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తీవ్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ అమిత్ బర్డార్ తో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. ఏఆర్ కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో భాగంగా ప్రతిరోజూ తనకు ఎస్కార్ట్ గా వస్తున్న విషయాన్ని గుర్తు చేసుకుని ధర్మాన కృష్ట దాస్ బాధ పడ్డారు. మరోవైపు ప్రమాద ఘటనా స్థలానికి మంత్రి సీదిరి అప్పల రాజు హుటాహుటిన చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందడం తమ పోలీస్ కుటుంబానికి తీరని లోటు అని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. శ్రీకాకుళం ఘటనపై దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డీఐజీ, ఎస్పీని ఆదేశించారు. అయితే ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరణించిన పోలీస్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం, పోలీస్ శాఖ అండగా ఉంటుంది అని ప్రకటించారు. కలకత్తాలో మరణించిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.