శ్రీధర్‌బాబు ఇల్లు ముట్టడికి బీజేపీ యత్నం
నాయకుల అరెస్టు, విడుదల
కరీంనగర్, ఫిబ్రవరి 2 (): రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు రాజకీయ అధికార దాహంతో వ్యవహరిస్తున్నారని బీజేపీ పట్టణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. శనివారం పట్టణంలోని మంత్రి నివాసాన్ని ముట్టడించేందుకు ప్రదర్శనతో వెళ్లిన బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకుండా శ్రీధర్‌బాబు కేవలం ప్రకటనలు చేయడాన్ని వారు విమర్శించారు. ఒక పక్క సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు రాష్ట్ర విభజన చేస్తే దేనికైనా సిద్ధమేనంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తుంటే శ్రీధర్‌బాబు ఎలాంటి ప్రసంగాలు చేయడంలేదని, వారి మాటలు ఆయనకు వినబడటంలేదనా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేయాలని అప్పుడే కేంద్రం ముందుకు వచ్చి తెలంగాణ ఏర్పాటుకు చర్యలు ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రం ఏర్పడే వరకు బీజేపీ పోరుసాగిస్తూనే ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి పనులు వెనుకబడ్డాయని, త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే కాని అభివృద్ధి పనులు ముందుకు సాగవని ఆయన అన్నారు. కేంద్రం వెంటనే తెలంగాణ ఏర్పాటుపై వచ్చే బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే బీజేపీ మద్దతు ఉంటుందని సంజయ్ అన్నారు. సాధ్యమైనంత త్వరలో తెలంగాణపై నిర్ణయం కేంద్రం ప్రకటించాలని సంజయ్ డిమాండ్ చేశారు.