శ్రీశాంత్‌ కేసులో సుప్రీం సంచలన నిర్ణయం

విచారణ చేయాలని ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలు
న్యూఢిల్లీ,మే15(జ‌నం సాక్షి ):  టీం ఇండియా మాజీ క్రికెటర్‌, ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2015 ఐపీఎల్‌ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా స్పాట్‌ ఫిక్సింగ్‌కి పాల్పడి జీవితకాల నిషేధాన్ని ఎదురుకుంటున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కేరళ హైకోర్టు శ్రీశాంత్‌కు క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. శ్రీశాంత్‌ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో అతన్ని నిర్ధోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో శ్రీశాంత్‌ తాను 2019 ప్రపంచకప్‌లో ఆడుతానని ధీమా వ్యక్తం చేశాడు. అంతవరకూ ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐని కోరాడు. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయంలో శ్రీశాంత్‌తో అంగీకరించలేదు. కాగా కేరళ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. బీసీసీఐ ఢిల్లీ కోర్టుతో పాటు సుప్రీం కోర్టులోనూ కేసును విచారించాల్సిందిగా కోరింది. బీసీసీఐ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న సుప్రీం కేసులో విచారణ చేపట్టాలని ఢిల్లీ హైకోర్టును ఆదేశించింది. అత్యున్నత న్యాయస్థానం అదేశాల మేరకు ఢిల్లీ కోర్టు ప్రత్యేక జ్యూరీని ఏర్పాటు చేసింది. జస్టిస్‌ దీపక్‌ మిశ్రా
అధ్వర్యంలో ఈ జ్యూరీ శ్రీశాంత్‌ కేసును విచారిస్తుంది. క్రికెట్‌ ఆడేందుకు ఈ ముగ్గురు ఆటగాళ్లు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో తాము అర్థం చేసుకోగలిగామని మిశ్రా అన్నారు. ఢిల్లీ న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరుగతున్న కారణంగా అక్కడి నుంచి తుది తీర్పు వెలువడే వరక తాము వేచి చూస్తామని ఆయన పేర్కొన్నారు. 2015 స్పాట్‌ ఫిక్సింగ్‌లో ఆరోపణలు ఎదురుకున్న 36 మందికి పటియాలా కోర్టు క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. అయినప్పటికీ బీసీసీఐ మాత్రం తమ నిర్ణయాన్ని మార్చుకొనేది లేదని తేల్చి చెప్పింది.
—–