శ్రీ మహాశక్తి ఆలయంలో ఘనంగా వరలక్ష్మి వ్రత వేడుకలు
* అంగరంగ వైభవంగా కుంకుమార్చన
* ఆలయానికి పోటెత్తిన భక్తులు
కరీంనగర్ ( జనం సాక్షి ) :
కరీంనగర్ పట్టణంలో చైతన్యపురి కాలనీలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రత పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దేవాలయ నిర్వాహకులు హైదరాబాద్ కు చెందిన ప్రఖ్యాత కళాకారులచే ఆలయ ప్రాంగణాన్ని పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో ఆలయానికి ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ముఖ్యంగా మహిళలు వేలాది మంది అమ్మవార్ల దర్శనం చేసుకుని, వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా శ్రీ మహాశక్తి ఆలయంలో దుర్గాదేవి, మహాలక్ష్మి, సరస్వతి దేవి అమ్మవార్లకు ఉదయం 5 గం.లకు అభిషేక పూజలను అర్చకులు నిర్వహించగా, భక్తులు అమ్మవార్లకు ఓడిబియ్యం తో పాటు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం దేవాలయంలో అశేష భక్తులు మహిళల మధ్య అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతం, కుంకుమార్చన, తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలను ఘనంగా చేపట్టారు. వరలక్ష్మి వ్రతం కోసం శ్రీ మహాశక్తి ఆలయానికి తరలివచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొన్న మహిళా భక్తులందరికీ
ఏలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. అలాగే ప్రముఖ సంగీత విద్వాంసులు కేబీ శర్మ ఆధ్వర్యంలోని కళాకారుల బృందంచే నిర్వహించిన సంగీత, భజన కార్యక్రమం భక్తజనులను అలరించింది