సంక్షేమంలో మనమే నంబర్‌వన్: ఎమ్మెల్యే
యాదాద్రి,ఏప్రిల్17(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు విమర్శించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నాయి కదా.. ఆ రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకోవాలని నాయకులకు సవాల్ విసిరారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసిందన్నారు. నూతన పంచాయతీల ఏర్పాటుతో పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం కానుందన్నారు. ప్రతి గ్రామానికి స్వయం పాలన అందించడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదింటి యువతులకు పెళ్లికానుకగా రూ.100116 అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ఏడాదికి రెండు పంటలకు పెట్టుబడి కోసం రైతులకు ఎకరాకు రూ.4వేల చొప్పున చెక్కులను అందించడమే కాకుండా రైతులకు పంటకు అవసరమైన ఎరువులను, విత్తనాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇవే కాకుండా మిషన్ భగీరథ, కాకతీయ పథకాలతో ప్రతి పొలానికి సాగునీరు అందించేందుకు కృషిచేస్తోందన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందజేసేందుకు గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు. గిరిజన గ్రామాలకు, తండాలకు సైతం బీటీ రోడ్లు నిర్మించామన్నారు.