సంఘ్‌ మొత్తాన్ని నిందించలేదు

4

– ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తుల్ని మాత్రమే అన్నాను

– రాహుల్‌ గాంధీ

దిల్లీ,ఆగస్టు 24(జనంసాక్షి):మహాత్మా గాంధీ హత్య విషయంలో తాను రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) నిందించలేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. గాంధీ హత్యకు సంఘ్‌ కారణమన్న రాహుల్‌ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్‌ పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. నేడు సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌పై జరిగిన విచారణలో రాహుల్‌ తరఫున ఆయన న్యాయవాది కపిల్‌ సిబాల్‌ రాహుల్‌ స్పందన కోర్టుకు తెలియజేశారు. రాహుల్‌ తాను సంఘ్‌ మొత్తాన్ని నిందించలేదని.. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం ఉన్న కొందరు వ్యక్తులను మాత్రమే అన్నానని చెప్పినట్లు సిబాల్‌ తెలిపారు. రాహుల్‌ వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు.రాహుల్‌ సమాధానంతో కోర్టు పరువునష్టం దావాను కొట్టేసే అవకాశం ఉంది. దీనిపై తదుపరి విచారణ సెప్టెంబరు 1న జరగనుంది. గతంలో సుప్రీంకోర్టు సంస్థ మొత్తాన్ని నిందించడం తప్పని పేర్కొంది. అలాగే క్షమాపణలు చెప్పి రాజీ చేసుకోవాలని రాహుల్‌కు సూచించింది. అయితే రాహుల్‌ క్షమాపణలు చెప్పేందుకు అంగీకరించలేదు. దీంతో ఈ కేసుపై స్పందించాలని కోర్టు రాహుల్‌ను ఆదేశించింది. దీంతో ఇప్పుడు రాహుల్‌ స్పందించారు. ఆయన సమాధానంతో.. రాహుల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ మొత్తాన్ని నిందించలేదనే విషయం అర్థమవుతోందని కోర్టు పేర్కొంది.  దీంతో సుప్రీంకోర్టు నుంచి రాహుల్‌ గాంధీకి ఊరట లభించిన్లటైంది. రాహుల్‌ గాంధీ ఆర్‌ఎస్‌ఎస్‌ను అవమానించలేదని కూడా సుప్రీమ్‌కోర్టు అభిప్రాయపడింది. కేసు విచారణను సెప్టంబర్‌ ఒకటికి మార్చారు. మహాత్మాగాంధీ హత్యకు ఆర్‌ఎస్‌ఎస్‌ కారణమని గతంలో రాహుల్‌ అన్నారు. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ సుప్రీమ్‌కోర్టులో పరువునష్టం దావా వేసింది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆరెస్సెస్‌ ప్రమేయం ఉందని తాను అనలేదని, ఆ సంస్థతో సంబంధం  ఉన్న కొందరు వ్యక్తులే ఉన్నట్లు చెప్పానని రాహుల్‌గాంధీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆయనపై ఆరెస్సెస్‌ వేసిన పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీ బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాహుల్‌ అఫిడవిట్‌ దాఖలుచేయడంతో ఈ అంశానికి ఇక్కడితో తెరపడినట్లేనని, అయితే పిటిషనర్‌ మరింత సమయం కోరడంతో సెప్టెంబర్‌ 1కి విచారణ వాయిదా వేస్తున్నట్లు కోర్టు వ్యాఖ్యానించింది. తనపై దాఖలైన పరువునష్టం కేసును కొట్టేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ గతేడాది మేలో రాహుల్‌ సుప్రీంను ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పండి లేదా విచారణను ఎదుర్కోండని రాహుల్‌ గాంధీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈంతో ఈ వివాదం సమిసిపోయినట్లుగానే భావించవచ్చు.