సత్యాగ్రహంతో సాధ్యం కాలేదు

1

– బ్యాలెట్‌ పోరులో శర్మిళ

న్యూఢిల్లీ,ఆగస్టు 10(జనంసాక్షి): గాంధీజీ నమ్మిన అహింసా సిద్ధాంతంతో ముందుకు సాగితే పాలకులు కదలరని మరోమారు అర్థం అయ్యింది. ఆనాటి బ్రిటిష్‌ పాకలు మెడలు వంచగలిగినా, నేటి భారత్‌ పాలకులను వంచలేమని ఇరోమ్‌ షర్మిల పోరాటం మనకు గుర్తు చేస్తోంది. అందుకే 16 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి ముగింపు చెప్పి రాజకీయంగా తన పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. దేశంలో రాజకీయంగానే ఏదైనా పోరాటం చేయాలి తప్ప దీక్షలు, అహింసా సిద్దాంతాలతో కాదని రుజువయ్యింది. తెలంగాణ ఉద్యమంలోనూ ఇదే సాకారమయ్యింది. ఆనాడు రాజకీయంగానే పావులు కదిపి ప్రత్యేక తెలంగాణ సాధించడంలో నేటి సిఎం కెసిఆర్‌ సఫలీకృతులయ్యారు. పార్లమెంట్‌ వేదికగా,రాజకీయంగా ఒత్తిడి తేవడంలో ఆయన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఇరోమ్‌ షర్మిల అమాయకంగా ఇంతకాలం దీక్షల ద్వారా ఆహారం తీసుకోకుండా పోలీసుల వేధింపులను భరిస్తూ ముందుకు సాగినా లాభం లేకుండా పోయింది. 16 ఏళ్ల పాటు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. అందుకే తన పంథాను మార్చుకుని మణిపూర్‌ రాష్ట్రానికి  ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా ప్రకటించి, తన పదహారు సంవత్సరాల సుదీర్ఘ నిరాహారదీక్షను మంగళవారం విరమించారు. దేశంలో ఇలాంటి అరుదైన ఘటన ఇదొక్కటే కావడం మనం గమనించవచ్చు. సుదీర్ఘంగా ఆమె దీక్షలు చేఇనా, గాంధీజీ నమ్మిన అహింసాసిద్దాంతంతో పోరాడినా లాభం లేదని గుర్తించారు. సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌-ఎఎఫ్‌ఎస్‌పిఎ)తో సైన్యం పాల్పడుతున్న అకృత్యాలకు, అరాచకాలకు అహింసాయుత పోరాటం ద్వారా సంకెళ్ళువేయగలనని ఇంతకాలమూ నమ్మిన షర్మిల ఇప్పుడు తన ఆశయసాధనకోసం పోరాట పంథాను మార్చుకుంది. ఇంతకాలం తాను చేసింది తప్పని చెప్పకపోయినా పోరాట మార్గం ఇది కాదని మాత్రం గుర్తించారు. ఈ పాలకులు ఇలా చెబితే వినరని గుర్తించారు. అందుకే తన విధానాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. మహాత్ముడి అహింసామార్గం బ్రిటిష్‌వారిని కదిలించి స్వాతంత్య్రాన్ని సంపాదించిపెట్టింది కానీ, షర్మిల 5757 రోజులుగా కడుపుమాడ్చుకొని చేస్తున్న ఈ పోరాటం మన పాలకుల మనసులను ఏ మాత్రం కరిగించలేక పోయింది. ఇప్పుడు, 2018లో జరిగే ఎన్నికల్లో పోటీచేసి రాజకీయంగా ఆ చట్టాన్ని తుదముట్టించాలని ఇరోమ్‌ షర్మిల నిర్ణయించుకుంది. దీంతో మనం గమనించా ల్సింది ఏమంటే,ఎక్కడైనా పోరాటం రాజకీయంగానే ఉండాలని పాలకుల తీరు చెబుతోంది. ఆమె చేసిన పోరాటం తక్కువదేవిూ కాదు. ఈశాన్యరాష్ట్రంలో తన పౌరులకు జరుగుతన్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు చేసిన ప్రయత్నంగా గుర్తించాలి. రాజకీయాల్లో ప్రత్యేక పంథాను అనుసరిస్తామని చెప్పుకున్న కమల నాథులను కూడా ఆమె దీక్షలు కదిలించలేక పోయాయి. మోడీ ప్రభుత్వం కూడా పాత సర్కార్‌ విధానాలతోనే ముందుకు సాగింది. లోంగోవాల్‌తో ఒప్పందం ద్వారా శాంతి స్థాపించాలని ఆనాటి ప్రధాని రాజీవ్‌ నిర్ణయించారు. నాగా తీవ్రవాదులతోనూ మోడీ సర్కార్‌ ఒప్పందం చేసుకుంది. కానీ ఇరోమ్‌ షర్మిల విషయంలో మాత్రం అలాంటి ప్రయత్నాలుచేయలేదు. కారణం ఆమె సాయుధ పోరాటం చేయకుండా కేవలం దీక్ష మాత్రమే చేశారు కాబట్టి. దీక్షలకు లొంగేది లేదని పాలకులు తమ వైఖరి ద్వారా తేల్చారు.

ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం కొనసాగిన ఈ నిరాహారదీక్షను  విరమించిన షర్మిల ఒక్కసారిగా కదిలిపోయి కన్నీటి చుక్కలను కూడా రాల్చింది. ఆ ఉద్వేగ క్షణాల అనంతరం, తన దీక్షను ఖాతరు చేయని ప్రభుత్వంవిూద, ఇప్పటి రాజకీయ వ్యవస్థవిూద ఇంతకాలమూ కూడగట్టుకున్న అసహనాన్ని వెళ్ళగక్కింది. ప్రధానికి ఈ వయసులో కావాల్సింది అహింసనీ, ఈ చట్టం లేనప్పుడు మాత్రమే ఆయనకు ప్రజలతో సంబంధాలుంటాయని హితవు చెప్పింది. గాంధీ చూపిన మార్గంలో ప్రజలతో కలిసి నడవమన్నది. పోరాటయోధురాలు కనుక, మిగతా రాజకీయవాదుల్లాగా మాట్లాడలేకపోయింది. పదునైన విమర్శలను సంధించలేకపోయింది.  మణిపూర్‌ రాష్ట్ర పగ్గాలు తనచేతుఎల్లో ఉంటే తప్ప తన లక్ష్యం నెరవేరదని గుర్తించింది. తాను  ముఖ్యమంత్రి అయితే తప్ప సాయుధ చట్టం ఎత్తివేయడంతో పాటు, రాష్ట్రప్రజలను పీడిస్తున్న పలుసమస్యలు పరిష్కరించడం సాధ్యం కాదని గుర్తించింది. తన ఆశయం నెరవేరవేరాలంటే తానూ రాజకీయంగా ఎదగాలని, అందుకు పోరాడాలని ఇరోమ్‌ షర్మిల కఠోర నిర్ణయం తీసుకుంది. దీక్ష విసయంలో కఠినంగా నిర్ణయం తీసుకున్నా రాజకీయంగా ఆమె నిర్ణయంఫళిస్తుందా అన్నది మణిపూర్‌ ప్రజల ఆదరణను బట్టి ఉంటుంది. ఆమె సంకల్పానికి  ప్రజల మద్దతు తోడైతేనే ఇది సాధ్యం అవుతుంది. ఇదే చట్టం అమలులో ఉన్న కశ్మీర్‌ ప్రజలకు స్వయం నిర్ణయాధికారం ఉన్నదని వారికి మద్దతు తెలిపింది. పెద్దగా చదువులేకపోయినా, రాజకీయాలు తెలియకపోయినా తన సంకల్పానికి ఇవేవిూ అడ్డుకావంటూ 20మంది ఇండిపెండెంట్లనూ తక్షణమే తనతో చేతులు కలపమని పిలుపునిచ్చింది. తాను దేవతను కానని, సామాన్యురాలినని ఆమె చెబుతున్నప్పటికీ, మణిపూర్‌లోనే కాక ఈ చట్టం అమలులో ఉన్న మిగతా ఈశాన్యరాష్ట్రాలకు ఆమె అందించిన స్ఫూర్తి అసామాన్యమైనది. అనుమానం వచ్చిన వ్యక్తులను కాల్చిపారేయవచ్చని చెబుతున్న ఈ దుర్మార్గమైన చట్టాన్ని అడ్డుపెట్టుకొని 2000 సంవత్సరం నవంబరులో బస్టాప్‌లో నిల్చున్న పదిమంది సామాన్యులను అస్సాం రైఫిల్స్‌ సైనికులు కాల్చిచంపిన ఘటన ఆమె ఉక్కు సంకల్పానికి కారణం. ఈ హక్కుల కార్యకర్త నిర్ణయాన్ని మిగతావారితో పాటు ఆమె పనిచేస్తున్న సంస్థ కూడా తీవ్రంగా తీసుకోలేదు. కానీ, సంకల్పాన్ని ప్రకటించిన మూడురోజుల్లో ఆమె దీక్షకు ఉపక్రమించడం, వెనువెంటనే ఆమె అరెస్టు కావడంతో ఆమె తరఫున నిలిచేవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2004లో ‘ఇండియన్‌ ఆర్మీ-రేప్‌ అజ్‌’ అంటూ 11 మంది మహిళలు అస్సాం రైఫిల్స్‌ కార్యాలయం ముందు నగ్నంగా నిలబడిన దృశ్యం జాతీయ విూడియా దృష్టికెక్కినా, ఇరోమ్‌ షర్మిల ఊసు అప్పటికి మణిపూర్‌ విూడియా కూడా మరిచిపోయింది. దీక్షప్రారంభించిన ఆరోయేట బెయిల్‌పై బైటకొచ్చి ఢిల్లీలో ప్రత్యక్షం కావడంతోనే ఆమె జాతీయవిూడియాను ఆకర్షించింది. ఆమె సంకల్పాన్ని గుర్తించని పాలకులు, ఆమెను కీర్తిస్తూ వచ్చిన వార్తలతో వణికిపోయి ఢిల్లీలోనే ఆత్మహత్యా యత్నం కేసుపెట్టి అరెస్టుచేశారు. కానీ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు దక్కుతున్న మద్దతుకు జడిసిన పాలకులు  ఏడాదిలోగా తిరిగి ఇంఫాల్‌ తరలించేశారు.  ఏడాది క్రితం బెయిల్‌పై విడుదలై మణిపూర్‌లో తిరుగుతున్నప్పుడు ఎక్కడికక్కడ గుమిగూడిన ప్రజలు ఆమె ఆశయాన్ని గుర్తించి జేజేలు పలకలేదు. కేవలం ఆమె  విచిత్రాకృతిని మాత్రమే చూస్తున్నట్టు ఆమె గుర్తించారు. ఇది కూడా ఆమె తన మార్గాన్ని మార్చుకోవడానికి దోహదపడివుండవచ్చు. అందుదేరాజకీయంగా ఢీకొనాలని నిర్ణయించి ఉంటారు. ప్రస్తుత సిఎంలుగా ఉన్న మహిళలు జయలలిత, మమతా బెనర్జీలు కూడా ఆమెకు స్ఫూర్తిని ఇచ్చి ఉంటారు.  అందుకే తాను నడుస్తున్న దారిలో కొంత మార్పు చేయాలనుకున్నారు. రాజకీయమే ఇందుకు దోహదపడగలదని భావించారు. భావి సిఎంగా తాను రంగంలోకి దిగాలన్న కోరికను వెల్లడించారు. ఇలా అయినా మణిపూర్‌ ప్రజల ఆశలునెరవేర్చగలిగేలా ప్రజలు ఆమెకు అండగా ఉంటారా అన్నది చూడాలి.