సదరం క్యాంపుకు వెళ్ళేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం

హత్నూర (జనం సాక్షి)
వికలాంగుల ధృవీకరణ పత్రాల జారీ కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ప్రతి నెలా రెండవ మంగళవారం నిర్వహించే సదరం క్యాంపుకు వెళ్ళే వికలాంగులకు సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సంస్థ అధ్యక్షుడు బాదె శివశంకర్ రావు అన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన అంగవైకల్యం కలవారు సదరం క్యాంపుకు వెళ్ళి వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు గుర్తు చేశారు. వారి ఇబ్బందులను తొలగించాలనే ఉద్దేశంతోనే ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టామని వారు తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో అంగవైకల్యం కలిగిన వారు మొదటగా  మీ సేవా సెంటర్ లో అప్లై చేసిన అనంతరం వారికిచ్చిన తేదీని బట్టి సదరం క్యాంపుకు వెళ్ళాలని ఆయన సూచించారు.క్యాంపుకు వెళ్ళేవారి కోసం ఉదయం 9 గంటలకు దౌల్తాబాద్ బస్టాండ్ లో వాహనం సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. క్యాంపు నిర్వహణ అనంతరం తిరిగి వారందరినీ యదావిధిగా దౌల్తాబాద్ బస్టాండ్ లో విడిచిపెట్టడం జరుగుతుందని వారన్నారు.వికలాంగులు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.