సబ్బండ జాతుల అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
-ఎమ్మేల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్18(జనంసాక్షి)
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సబ్బండ జాతుల అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి అని, వారి జీవిత చరిత్ర నేటి సమాజానికి ఆదర్శమని, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మేల్యే శంకర్ నాయక్, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. గురువారం ఉదయం శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మేల్యే, జిల్లా కలెక్టర్ పాల్గొని శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, జనగామ జిల్లా రఘునాథపల్లి ఖిలాషాపురం గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ జన్మించారని, గొప్పవారి చరిత్రను మననం చేసుకోవడం జాతికే గర్వకారణమని, సామాన్య కుటుంబంలో పుట్టి కల్లుగీత వృత్తి చేస్తూ సాధారణ జీవనం కొనసాగించే వాడని, స్థానిక దొరలు భూస్వాములను మొగల్ సామ్రాజ్య వాదులను ఎదుర్కోవడానికి స్నేహితులైన 12 మందితో 12వందల సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని, యుద్ధ విద్యలో ఎత్తుగడలు వేయడంలో మెళకువలు నేర్చుకుని సర్వాయిపేట తాటికొండ ఖిలాశాపురంలో కోటలను నిర్మాణం చేసుకుని, పరిపాలనాదక్షుడు గా ప్రజల మన్నలను పొందారని, కృషి పట్టుదల ఉంటే సామాన్యులు సైతం రాజ్యమేల వచ్చని ఆచరణలో పెట్టారనీ, అలాంటి గొప్ప మహానుభావుడు స్ఫూర్తితో నేటి యువత ముందుకు సాగాలని, పాపన్న గౌడ్ కుల,మతాలకు అతీతంగా అందరి శ్రేయస్సు కోరారని తెలిపారు. టెక్నాలజీ యుగంలో కూడా అంత ఎత్తులో కల్లు ఒడిచే యంత్రాలు వచ్చిన అనుకూలంగా లేవని, రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ప్రాంతాల వారిని గుర్తించి సముచిత స్థానాన్ని ఇస్తుందని, కల్లుగీత కార్మికులకు పెన్షన్, ఆరు లక్షల ఇన్సూరెన్స్ ను కూడా అందజేస్తుందని తెలిపారు. ఎంతో ఎత్తులో వెళ్లి ధైర్యసాహసాలతో ప్రధాన వృత్తిగా కుల వృత్తుల తో వారు జీవనం గడుపుతూ ఉంటారని, గత 20 సంవత్సరాల నుండి కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని ఈ సారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా నిర్వహించబడుతుందని తెలిపారు. గౌడ కులస్తులలో నిరుపేదలను ప్రభుత్వం ఆదుకుంటు ఎదుగుదలకు కృషి చేస్తుందని, పట్టణంలో విగ్రహాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ కిరణ్, వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నరసింహ స్వామి, వివిధ జిల్లా అధికారులు, కల్లు గీత కార్మిక సంఘం ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.