సబ్ సెంటర్లు హెల్త్ సబ్ సెంటర్లు మన ఊరు మనబడి కింద చేపట్టిన పనులు ఈనెల చివరి వరకు పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ,అక్టోబర్ 7 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లాలో హెల్త్ సబ్ సెంటర్ల పనులు, మన ఊరు మనబడి క్రింద చేపట్టిన పనులు అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశము హాలు నందు పంచాయతీరాజ్, విద్యా శాఖ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పల్లె దవాఖానలు,మన ఊరు మన బడి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు.గ్రామాలలో చేపట్టిన బస్తీ దవాఖానలు పనులు ఎంతవరకు వచ్చాయని ప్రశ్నించారు.అన్ని గ్రామాలలో పిహెచ్సి పనులు ముమ్మరం చేసి ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. కొన్ని గ్రామాలలో పిహెచ్సి పనులు మంజూరైన మొదలు పెట్టలేదని ,వాటికి టెండర్లు పిలిచి ఇతర కాంట్రాక్టర్ల ద్వారా పనులు జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పల్లె దవాఖానాల పనులు పూర్తిచేసి కలరింగ్ పూర్తి చేసి , ప్రారంభానికి సిద్దం చేయాలన్నారు. ఈ సందర్భంగా పల్లె దవాఖాన గురించి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేసిన పనులకు సంబందించిన వివరాలు ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున పీహెచ్సీ కేంద్రాలు పై నీరు నిలువ ఉండకుండా మరమ్మతులు చేయించాలన్నారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద పాఠశాలలకు మంజూరైన పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. పాఠశాలల మరుగుదొడ్లు, డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్ లకు మంజూరైన పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులలో అలసత్వం వహించరాదని,స్కూల్ వారిగా పనులు పూర్తి చేసి ఆన్లైన్ రికార్డు నమోదు చేయాలన్నారు.జిల్లాలోని పాఠశాలలలో పెండింగ్ పనులను పర్యవేక్షించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలోజిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, ఈ ఈ సమత, డి ఎం అండ్ ఎచ్ ఓ చందునయాక్, క్రాంతి కుమార్, డి ఇ ఓ సిరాజుద్దీన్, రామచందర్ ఇ ఇ , శ్రీనివాస్, రవీందర్, డి ఇ లు, ఏ ఇ లు, సంబందిత అధికారులు పాల్గొన్నారు.