సమర్ధవంతంగా లోకాయుక్త నిర్వహణ : కృష్ణాజీరావు
విజయవాడ, జూలై 21 : కర్ణాటకతో పోలిస్తే మన రాష్ట్రంలో లోకాయుక్తకు మౌలిక వసతులు, సిబ్బంది తక్కువగా ఉన్నట్లు ఉప లోకాయుక్త కృష్ణాజీరావు తెలిపారు. అయినప్పటికీ ఉన్న సిబ్బందితోనే లోకాయుక్త విధులను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని, సాధ్యమైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరిస్తున్నామని ఆయన శనివారం ఇక్కడ మీడియాకు చెప్పారు. త్వరలోనే ఆన్‌లైన్ ఫిర్యాదుల స్వీకరణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే లోకాయుక్త వెబ్‌సైట్‌లో కేసుల స్థితిగతుల వివరాలను పొందుపరుస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లోకాయుక్త గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకు విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. లోకాయుక్తలో నమోదైన కేసుల విచారణకు తగిన సాక్ష్యాధారాలను ఫిర్యాదుదారులే సమర్పించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. కాగా రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో ప్రసాదం నాణ్యంగా ఉండేటట్లు చూడాలని ఆలయ కార్యనిర్వహణాధికారులను ఆయన ఆదేశించారు. ప్రసాదం అనేది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఆ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదన్నారు. శనివారం కనకదుర్గమ్మను దర్శించుకున్న ఉప లోకాయుక్త ఆలయంలోని ప్రసాదాల విభాగాన్ని తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రసాదం అందజేశారు.