సమర యోధుల త్యాగఫలం తెలంగాణ

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
రెండు వందల సంవత్సరాల అణచి వేతకు వ్యతిరేకంగా సమర యోధుల పోరాట ఫలితంగా నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందిందని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు, రైతు సంఘాల నాయకుడు పోలాడి రామారావు అన్నారు.
1947ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం రాగా 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన లోని హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం చేయడం జరిగిందన్నారు.
తెలంగాణా ప్రాంత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనమై 75వ సంవత్సరం లో అడుగిడుగుతున్న సందర్బంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా తెలంగాణ వజ్రోత్సవాలు జరపడం తెలంగాణ ప్రాంత ప్రజలకు పండుగ వాతావరణం లాంటి మహోత్సవ వేడుక అని రామారావు పేర్కొన్నారు.
శనివారము ఓసి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని సమాఖ్య కార్యాలయంలో నాయకుల తో కలిసి నిర్వహించిన తెలంగాణా వజ్రోత్సవ కార్యక్రమం లో పోలాడి రామారావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భగా రామారావు మాట్లాడుతూ రెండు వందల సంవత్సరాల దోపిడీ అణచి వేతకు వ్యతిరేకంగా రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావు, చాకలి అయిలమ్మ, దొడ్డ కొమురయ్య, మాడపాటి హనుమంతరావు, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, షోయబుల్లాఖాన్, సురవరం ప్రతాప రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దుగ్గిరాల వెంకట్ రావు, తదితర ఎందరో సాయుధ పోరాట యోధులు వారికి స్ఫూర్తిని ఇచ్చే కవులు, రచయితలు, కళాకారుల మూలంగా సంస్థాన ప్రజల సబ్బండ వర్గాల అనేక వీరోచిత పోరాటాల ఫలితంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సబ్బండ వర్గాలు నిప్పు కణికలై ఎర్ర దివిటీలై కారం పొడి, వడిసెల రాళ్ళయి పోరాడారని తెలిపారు. సామాన్యుడే తుపాకీ పట్టి జంగ్ సల్పితే పోరుబాటకు సైరన్ ఊదడంతో నీ భాంచన్ దొర ఆన్న నాల్కలు నీ ఘోరీ కడతం కొడుకో అంటూ శివాలెత్తి శివ సత్తులై మా భూమి మాగ్గావాలని పల్లెలు అరిస్తే నిజాంలు దిగివచ్చానన్నారు. 1948లో సంస్థాన ప్రజల పోరాటం ఉదృత రూపం దాల్చడంతో చివరికి భారత యూనియన్ హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశాల మేరకు ప్రభుత్వ సైనిక చర్యతో గడీల దొరలు గడ గడ లాడే గోల్కొండ ఖిల్లా గుండెలు అదిరి రజాకార్లు తోకలు ముడిచారన్నారు. విద్రోహ మచ్చలు ముడుచుకుపోయి నిజాములు గులాములై 1948సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రాంత హైదరాబాద్ సంస్థానం భారతదేశ యూనియన్ లో విలీనం జరిగిందన్నారు. దగా పడ్డ తెలంగాణ ప్రజలు ఊపిరపీల్చుకొని స్వేచ్ఛ స్వాతంత్ర్యం పొందారని పోలాడి రామారావు అమర వీరులకు జోహార్లు అర్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లో 15రోజుల పాటు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాది కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించి దేశ స్వాతంత్ర్య ఔన్నత్యాన్ని సమైక్యతను ఘనంగా చాటి చెప్పే భావి తరాలకు స్ఫూర్తినిచ్చింది అని పోలాడి రామారావు ఆనందం వ్యక్తం చేశారు.