సమస్యల పరిష్కారం కోసం సమ్మె

ఆందోళనలకు దిగిన మున్సిపల్‌ కార్మికులు
9ప్రధాన డిమాండ్ల అమలుకు డిమాండ్‌

అమరావతి,జూలై11(జనం సాక్షి ):తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ …సోమవారం నుండి మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేపట్టారు. భారీ వర్షాలను సైతం లెక్కచేయకుండా అన్ని మున్సిపాలిటీల్లోనూ నిరసనలు, మానవహారాలు కొనసాగుతున్నాయి. మున్సిపల్‌ ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపుమేరకు.. అన్ని సంఘాల ఆధ్వర్యాన మున్సిపల్‌ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. అత్యవసర విభాగాలకు చెందిన ఉద్యోగులు మాత్రం 13వ తేదీ వరకూ విధులకు హాజరవుతారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 14వ తేదీ నుండి వారుకూడా సమ్మెలోకి వెళ్లనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హావిూ మేరకు తొమ్మిది ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని
కోరుతూ రాష్ట్రవాప్తంగా ఉన్న 35వేల మంది కార్మికులు విధులకు గైర్హాజరయ్యారు. తిరుపతి, నెల్లూరు, నంద్యాల, గుంటూరు మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. 11వ పీఆర్సీ ప్రకారం వేతనం చెల్లించాలని అదేవిధంగా భత్యం ఇవ్వాలని కార్మికులు కోరుతున్నారు. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని, డ్రైవర్లకు, యూడీఎస్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించాలని కార్మిక సంఘాల నాయకులు కోరారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులందరిని పర్మినెంట్‌ చేయాలని , పర్మినెంట్‌ కార్మికులకు సరెండర్‌ లీవులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 9 ప్రధాన డిమాండ్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం కార్మిక సంఘాలు గత నెలలో సమ్మె నోటీసులిచ్చాయి. పురపాలకశాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో పారిశుద్ధ్య కార్మికులు, ప్రజారోగ్య, ఇంజినీరింగ్‌ విభాగాల్లోని ఉద్యోగులు నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. కాగా మరికొన్ని చోట్ల కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మరికొందరిని గృహనిర్బంధం చేశారు.వర్షాల నేపథ్యంలో కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రజారోగ్యంపై ప్రభావం పడకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షంలో కూడా కొనసాగుతోంది. ఈ సమ్మెలో అధికసంఖ్యలో యూనియన్‌ నాయకులు, కార్మికులు పాల్గన్నారు. ఎస్‌ఎస్‌.చెంగయ్యా, వై.కమలాకర్‌ కుర్ర ఏడుకొండలు, దుపాటి శివశంకర్‌, యన్నం శివనాగేశ్వరావు, కటారి ఆంజనేయులు, కటారి శ్రీనివాసరావు, సాదరబోయిన నాగేశ్వరరావు, బ్రమ్మశ్వరావు, ప్రభాకర, దుర్గారావు, తదితర నాయకులు పాల్గొన్నారు. రసరావుపేట మున్సిపల్‌ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికులు నిరసన చేపట్టారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య, సిఐటియు పట్టణ కార్యదర్శి సిలార్‌ మసూద్‌ మద్దతు తెలిపారు. ఈ సమ్మెలో భాగంగా గుంటూరు లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. గుంటూరులో మున్సిపల్‌ కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు జిల్లా కందుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె సోమవారం సంపూర్ణంగా కొనసాగుతోంది. నేటి ఉదయం నుంచి కార్మికులెవరూ పనులకు హాజరుకాకపోవడంతో కందుకూరు పట్టణంలో ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోయింది. మున్సిపల్‌ వాహనాలు బయటికి రాలేదు. తమ సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని కార్మికులు స్పష్టం చేశారు. స్థానిక అంబేద్కర్‌ బమ్మ వద్ద పరిశుద్ధ కార్మికులతో జరిగిన సమావేశంలో సిఐటియు నాయకులు గౌస్‌, ఎఐటియుసి నాయకులు బి.సురేష్‌, తదితరులు మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు పురపాలక సంఘం మునిసిపల్‌ కార్యాలయం వద్ద నుండి మెయిన్‌ రోడ్‌ విూదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయం వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినాదాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం జరుగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె కార్యక్రమం కొండపల్లిలో కొనసాగింది. సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కొండపల్లి మున్సిపాలిటీ కార్మికులు సమ్మెను కొనసాగించారు. కొండపల్లి మున్సిపాలిటీ పుర వీధుల్లో మున్సిపల్‌ కార్మికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రదర్శన నిర్వహించారు. వర్షంలోనే నినదిస్తూ … తమ బాధలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలకు సేవ చేసే తమను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమంటూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మహేష్‌, మున్సిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం పాలకొల్లులో మున్సిపల్‌ పారిశుధ్య తాత్కాలిక కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం ముందు ధర్నా చేశారు. హెల్త్‌ అలవెన్స్‌ బకాయిలు చెల్లించాలని,
కార్మికులను పర్మినెంట్‌ చేయాలని నినాదాలు చేశారు. ఈ ధర్నాలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ధనాల శ్రీనివాస్‌, ధనాల కొండ, నీలపు శ్రీనివాస్‌ నాయకత్వం వహించారు.
మునిసిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో… మునిసిపల్‌ కార్యాలయం వద్ద సమ్మె తణుకు మునిసిపల్‌ పారిశుధ్య కార్మికులు సమ్మె చేపట్టారు.