సమీకృత వ్యవసాయంపై దృష్టి పెట్టాలి

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
లాభదాయక పంట సాగు రావాలి
భూమికి నష్టం కలిగించే రసాయన ఎరువులు, విత్తనాలు వాడొద్దు
సేంద్రీయతపై రైతులు దృష్టి సారించాలి
– మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి):వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే సమీకృత వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం జిల్లా కేంద్రంలోని సదాశివారెడ్డి ఫంక్షన్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సు లోరాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే  చిరుమర్తి లింగయ్యలతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని, రైతులు వరియే కాకుండా ఇతర సమీకృత లాభదాయక పంటలు పండించాలని రైతులకు సూచించారు.వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు ఎన్నో వస్తున్నాయని ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడినటువంటి వారు కూడా వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయ శాస్త్రవేత్తల అనుభవాలు, సూచనలు పరిగణలోకి తీసుకుని లాభదాయక పంట సాగు చేసి ఆదర్శ రైతులుగా స్ఫూర్తినిస్తున్నారని, వారి స్ఫూర్తిని పరిశీలన చేయాలన్నారు.తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని, ఆదిశగా రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటూ రైతులకు నిరంతరం నాణ్యమైన ఉచిత విద్యుత్ తోపాటు, రైతులకు రెండు పంటలకు పెట్టుబడి సహాయం, రుణమాఫీ, చనిపోయిన రైతులకు రైతు బీమా వంటి అనేక పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.జిల్లాలో వ్యవసాయ సాగుతో పాటు ఉద్యాన సాగు కూడా గణనీయంగా పెరిగిందన్నారు.గత 60 ఏళ్ల నుండి రసాయన ఎరువులు, విత్తనాలు వాడుతున్నామని, వాటి వల్ల జరుగుతున్న నష్టాలను వివరిస్తూ, రసాయన ఎరువులతో భూమిలో సారవంతం తగ్గి పోతుందని వివరించారు. సేంద్రీయతపై రైతులు ఎక్కువ దృష్టి సారించాలన్నారు.సదస్సులో భాగంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు, అభ్యుదయ రైతులు పలు లాభదాయక పంటలపై రైతులకు అవగాహన కల్పించారు.అనంతరం రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రత్యేక  పథకాలు అందిస్తుందని, రైతులు లాభదాయక పంటల సాగు చేయాలని అన్నారు.జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రైతులు వరి పంట అధికంగా పండిస్తున్నారని, ఒకే పంట సాగు వలన భూమిలో  సారవంతం తగ్గిపోవడం జరుగుతుందన్నారు.రైతులు జిల్లాలో సమీకృత వ్యవసాయం, లాభదాయక పంటలపై దృష్టి మళ్లించాలని, ఇప్పటికే రైతు వేదికల ద్వారా ప్రభుత్వ మార్గదర్శకాలతో పాటు వివిధ పంట సాగు విధానంపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు.ఉద్యాన పంటలపై రైతులకు సందర్శన, టూర్ లు చేపట్టడంతో ఉద్యాన సాగు జిల్లాలో పెరిగిందని వివరించారు.వరి పంట ఎఫ్ సిఐ కొనుగోలు చేయడం లేదని, రైతులు ఆర్ధిక వనరులు పెంచుకునేందుకు లాభదాయక పంటలు సాగు చేయాలని సూచించారు.అనంతరం రైతు మిత్ర ఫౌండేషన్ ద్వారా అభ్యుదయ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు,జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను  శాలువలతో సన్మానించి అవార్డులు అందించారు.ఈ కార్యక్రమంలో డిఏ.ఓ రామారావు నాయక్, డిహెచ్ఓ శ్రీధర్ గౌడ్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస రావు, ఎఫ్డిఓ సౌజన్య, రైతులు, ఉద్యాన, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area