సర్కారుకు ప్రజా ఉద్యమాల ‘షాక్‌’

గృహావసరాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ చార్జీల పెంపు ఉండదు
కొత్త టారిఫ్‌ ప్రకటించిన సీఎం కిరణ్‌
హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) :
ప్రజా ఉద్యమాలతో కిరణ్‌ సర్కారు దిమ్మతిరిగింది. గృహ విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచాలని ఈఆర్‌సీ చేసిన సిఫార్సును యథాతదంగా అమలు చేయాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రికి స్వపక్షం నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రజలు గొంతువిప్పి ఆందోళనలకు దిగారు. వారికి రాజకీయ పార్టీలు కూడా జతకలవడం, ఏడాదిలోపే సార్వత్రికలు ఉండటంతో అధిష్టానం జోక్యం చేసుకొని కిరణ్‌కు మొట్టికాయలు వేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గృహవినియోగ చార్జీలను సవరించకుండానే కొత్త టారిఫ్‌ ప్రకటించారు. గురువారం సచివాలయంలో విద్యుత్‌ చార్జీల పెంపుతో మంత్రులతో సమావేశమై చర్చించిన కిరణ్‌కు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త టారిఫ్‌ను ప్రకటించారు. ప్రజలపై భారం మోపబోతున్నట్టు ప్రతిపక్షాలు అనవరసరంగా రాద్దాంతం చేశాయన్నారు. ప్రస్తుతం పెంచిన చార్జీలను కొంతమేరకు తగ్గించామన్నారు. ఎప్పుడైనా అందరి వాదనలు విన్న తర్వాతే చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీరాలంటే లక్షామూడు వేల యూనిట్ల విద్యుత్‌ అవసరమని ఈఆర్‌సీ అంచనా వేసిందన్నారు. యూనిట్‌ ఉత్పత్తికి రూ.5.25 ఖర్చవుతోందని పేర్కొన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌ కొనసాగిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 30.70 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2.55కోట్ల విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయని, గృహ వినియోగదారులకు యాభై యూనిట్ల వరకు పాత ధరకే విద్యుత్‌ సరఫరా చేస్తామన్నారు. యాభై యూనిట్లకంటే తక్కువ వినియోగించేవారికి రూ.3.50 రాయితీ కల్పిస్తున్నామన్నారు. 51 నుంచి 100 యూనిట్ల విద్యుత్‌ వాడకందారులకు రూ.2.60 రాయితీ
ఇస్తున్నామని తెలిపారు. డిస్కంలకు అయ్యే ఖర్చులను ఈఆర్‌సీయే నిర్ణయిస్తుందన్నారు. రూ.49 వేల కోట్లు కావాలని డిస్కంలు కోరాయని పేర్కొన్నారు. ఈఆర్‌సీ రూ.40,640 కోట్లకు అనుమతించిందన్నారు.
కొత్త టారిఫ్‌ చార్జీలు
– 50 యూనిట్లలోపు విద్యుత్‌ వాడకందారులపై రూ.1.45లు
– 51 నుంచి 100 యూనిట్లలోపు వారికి రూ.2.60లు
– 101 నుంచి 200 యూనిట్లలోపు వారికి రూ.3.60లు
150 యూనిట్లలోపు విద్యుత్‌ వాడకందారులకు పాత చార్జీలే వసూలు చేస్తామని సీఎం తెలిపారు. విద్యుత్‌ వినియోగదారులకు ప్రభుత్వం రూ.6,310 కోట్లు రాయితీ ఇస్తుందన్నారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని ఆందోళన చేస్తున్నవారంతా పెట్టుబడిదారుల మనుషులేనని ఆరోపించారు.