సర్కార్ అసమర్ధత కారణంగానే విద్యుత్ కోతలు
విజయనగరం, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధత కారణంగా రోజురోజుకు విద్యుత్ కోతలు పెరుగుతున్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకుడు అవనాపు విక్రమ్ తీవ్రంగా ఆరోపించారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలోని విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రమైన విజయనగరంలోని దాసన్నపేట విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాను గంటల తరబడి నిలిపివేస్తుండడంతో అన్ని రకాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రధానంగా విద్యుత్ అధారిత చిన్నస్థాయి పరిశ్రమలపై ఆధారపడ్డ కార్మికులు ఉపాధి లేక అలమటిస్తున్నారన్నారు. విద్యుత్ కోతలతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. అలాగే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా అందడం లేదన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు వలనే విద్యుత్ పరిస్థితి ఇంత భారీగా దిగజారిందని దుయ్యబట్టారు. భవిష్యత్‌లో కూడా విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు కనుచూపు మేరలో కానరావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అస్తవ్యస్థంగా మారిందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి పదవుల కోసం పాకులాట ప్రారంభమైందన్నారు. ఇప్పటికైనా ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు, వైఎస్‌ఆర్ పార్టీ కార్యకర్తలు, పలువురు వినియోగదారులు విద్యుత్ కోతపై తీవ్రస్థాయిలో మండిపడి నినాదాలు చేశారు. వ్యవసాయానికి గృహ, వాణిజ్య అవసరాలకు విద్యుత్ అందని పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యుత్ కోతల వలన తాగునీటి సరఫరా కూడా అస్తవ్యస్థంగా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చీకటాంధ్రప్రదేశ్‌గా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.