సర్జికల్‌ స్టైక్స్ర్‌ రాజకీయం చేస్తున్నారు 

– సైనికుల త్యాగాల నుంచి మోదీ ప్రభుత్వం లబ్ధిపొందాలన చూస్తుంది
– కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా
న్యూఢిల్లీ, జూన్‌28(జ‌నం సాక్షి) : రెండేళ్ల క్రితం చేపట్టిన సర్జికల్‌ స్టైక్స్ర్‌ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. దేశం కోసం రక్తం చిందిస్తున్న భారత సైనికుల త్యాగాలను ఓట్ల కోసం ఉపయోగించుకోవద్దని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా విమర్శించారు. గురువారం ఉదయం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ.. సైనికుల త్యాగాల నుంచి మోదీ ప్రభుత్వం లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. మరోవైపు పాకిస్థాన్‌తో డీల్‌ చేసే విషయంపై సరైన మార్గదర్శకాలు, ప్రణాళికలు ఇవ్వలేకపోతోందని దుయ్యబట్టారు. సైనికులకు సరైన సదుపాయాలు, సైనిక పరికరాలు కల్పించకుండా ప్రభుత్వం వారి పట్ల సవతి తల్లిలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. గత ఏడాది ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా మోదీ ప్రభుత్వం ఇలాగే సర్జికల్‌ స్టైక్స్‌ ను రాజకీయం చేసిందని విమర్శించారు. భారత సైన్యం ధైర్య సాహసాలను తాము ప్రశంసిస్తున్నామని, సైన్యానికి కాంగ్రెస్‌ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.