సర్వేలో పాల్గొనని మీరా విమర్శించేది
` ముందు కులగణనలో పాల్గొనండి
` కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు దరఖాస్తు పత్రాలను పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్(జనంసాక్షి):బీసీలపై ప్రేమ కురిపిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు, మాజీ ముఖ్యమంత్రి, మంత్రులు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ముందుగా కులగణనలో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా కులగణన దరఖాస్తులను వారికి పంపారు. ఈ సందర్భంగా మంగళవారం కరీంనగర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ముందు మీరు కులగణనలో పాల్గొని.. అప్పుడు మాట్లాడాలన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆరెస్‌కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా.. చేతగకపోతే నోరు మూసుకుని కూర్చోవాలన్నారు. కులగణనపై బీజేపీ కుట్ర చేస్తోందని.. సూచనలు, సలహాలు ఇస్తే తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మైనార్టీలను ఇప్పుడు కొత్తగా బీసీల్లో చేర్చలేదని.. మైనార్టీలు ఎప్పటి నుంచో బీసీల్లో ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌కు దమ్ముంటే కేంద్రంతో దేశ వ్యాప్తంగా కుల సర్వే చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తే.. బీసీ సమాజం బాధపడిరదని అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట కవిత లిక్కర్ నినాదం అయి పోయిందని, ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్నారని అన్నారు. కవితకు అప్పుడప్పుడు జాగృతి గుర్తుకు వస్తుందని, ఏమీ లేకపోతే బతుకమ్మ నినాదం ఎత్తుకుంటారని, ఆమె ఒక ఆడబిడ్డ.. ఆమెను విమర్శించాలని తమకు లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.